King Cobra: పాములు అంటే చాలామందికి చచ్చేంత భయం. అందుకే ఆ పేరు విన్నా హడలెత్తిపోతుంటారు. ఇంకా ఎప్పుడైనా పాము ఎదురుపడిందా? అంతే సంగతులు.. క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతారు. ఇదిలా ఉంటే ఇటీవల మూగజీవాలు అడవిని వీడి గ్రామాల్లోకి వస్తున్నాయి. పెద్ద పెద్ద పాములు, కొండ చిలువలు ఇళ్లలోకి చొరబడి అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. అలా ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలోకి భయంకరమైన కింగ్ కోబ్రా ప్రవేశించింది. ఓ ఇంటిలోకి చొరబడి రెండు కోళ్లను కాటేసి చంపడంతో పాటు కోడి గుడ్లను అమాంతం మింగేసింది. దీన్ని చూసి హడలిపోయిన ఇంటి యజమానులు మురళీవాలే హౌస్లా అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఇతనికి చుట్టుపక్కల ప్రాంతాల్లో డేరింగ్ స్నేక్ క్యాచర్‌గా మంచి గుర్తింపుఉంది. ఎంతటి ప్రమాదకర పాములనైనా సులువుగా పట్టుకోగల నైపుణ్యం మురళీకి ఉంది. అన్నట్లు ఇతనికి ఓ సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో స్నేక్ క్యాచింగ్ వీడియోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తుంటాడు. అలా తాజాగా మరో వీడియోను పంచుకున్నాడు. అందులో కోడి గుడ్లను మింగేసిన కోబ్రాను ఎలా పట్టుకున్నాడో, అక్కడి ప్రజల బారి నుంచి ఎలా రక్షించాడో చెప్పుకొచ్చాడు.
కాగా ఓ కోళ్ల గూడులోకి వెళ్లిన ఓ కింగ్ కోబ్రా.. అందులోని రెండు కోళ్లను కాటేసి చంపేస్తుంది. అదేవిధంగా నాలుగు కోడి గుడ్లలో రెండింటిని మిగేస్తుంది. ఎప్పటిలాగే ఉదయం ఇంటి యజమానులు కోళ్ల గూడు తెరవగా.. అందులో చనిపోయిన కోళ్లతో పాటు కింగ్ కోబ్రా కనిపిస్తుంది. దీంతో భయపడి వారు మురళీకి సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన అతను తన స్టిక్ సాయంతో కింగ్ కోబ్రాను బయటకు తీసుకొస్తాడు. అప్పటికే అది గుడ్లు మింగి ఉండడంతో అది పారిపోవడానికి వీలు లేకుండా పోతుంది.దీంతో అక్కడి ప్రజల్లో కొందరు దానిని కొట్టి చంపేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే మురళి వారితో మాట్లాడి పామును చంపవద్దని వేడుకుంటాడు. కొద్ది సమయం తర్వాత కింగ్ కోబ్రా మింగేసిన రెండు గుడ్లను కక్కేస్తుంది. ఆపై దానిని సంచిలో బంధించి తీసుకెళతాడు. చనిపోయిన కోళ్లకు నష్టపరిహారంగా వాటి యజమానులకు సైతం డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..