
తాజాగా ఓ పెళ్లిలో ఆడపిల్లను పెళ్లి చేసి పంపేటప్పుడు ఏకంగా రూ.1 కోటి 51 లక్షల నగదు, సుమారు రూ.3 కోట్ల విలువైన బంగారం, వెండి కట్నంగా ఇచ్చారు అంటే మీరు నమ్ముతారా? కట్నమే అంత భారీ ఎత్తున ఇచ్చారంటే.. పెళ్లి ఇంకెంత ఘనంగా చేశారో అని మాట్లాడుకోవడం సహజం. అయితే ఇది ముమ్మాటికీ నిజం.. ఇంతకీ ఇంత ఘనమైన పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసుకుందా పదండి…
రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ నగరం సడోకాన్ హాల్‌లోని హనుమాన్ బాగ్‌లో నివాసముంటున్న రాంబక్స్ ఖోజాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాంబాక్స్ ఖోజా వ్యవసాయ పనులు చేస్తుంటాడు.అయితే అతని ముగ్గురు కుమారులు హర్నివాస్ ఖోజా, దయాల్ ఖోజా, హర్‌చంద్ ఖోజా… తమ చెల్లె బిరాజయ దేవి పెళ్లిని ఘనంగా చేశారు. భారీగా అంటే అంతా ఇంతా కాదు.. వివరాలన్నీ తెలిస్తే మీరు నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోక తప్పదు. ముగ్గురిలో ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, ఒకరు ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. తమ సోదరి బిరాజయ దేవికి జయల్ అసెంబ్లీలోని ఫర్దౌద్‌లో నివాసం ఉంటున్న మదన్‌లాల్‌తో వివాహం నిశ్చయించారు. దీంతో భారీ ఎత్తున చెల్లి పెళ్లిని చేయాలని అనుకుని మైరా పద్దతి ప్రకారం కట్నం ఇవ్వాలని ముగ్గురు అన్నదమ్ములు నిర్ణయించారు. ఈ లెక్కన చెల్లెలి భర్తకు రూ. 1 కోటి 51 లక్షల నగదు, 30 తులాల బంగారం, ఐదు కిలోగ్రాముల వెండితో పాటు రెండు ప్లాట్లను వారి సోదరికి బహుకరించారు.. స్వతహాగా రైతు కుమారులైన వాళ్ల వాహనాల్లో కట్టలు కట్టలు డబ్బు, బంగారంతో నిండిన కాన్వాయ్ రాగానే ఆశ్చర్యపోవడం పెళ్లికి వచ్చినవారి వంతైంది. దీంతో మైరా పద్దతిలో వరకట్నం ఇవ్వడం నాగౌర్ ప్రాంతమంతా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
అసలు మైరా పద్దతి ఏంటో ఇప్పుడు చూద్దాం. మైరా అనేది మొఘలుల కాలం నుంచి నాగౌర్ జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన విధానం. మైరా సంప్రదాయం హిందూ వివాహ వేడుకలలో ఓ కీలకమైన భాగం. ఈ పద్దతి ప్రకారం వధువు తల్లిదండ్రులు వివాహ ఖర్చుల ఆర్థిక భారాన్ని పంచుకుంటారు. పురాతన కాలంలో స్త్రీలకు వారి తండ్రి ఆస్తిపై హక్కు ఉండేది కాదు. అందువల్ల ఇంటి ఆడబిడ్డకు పెళ్లి మాత్రం ఘనంగా చేయాలని, కట్నకానుకల రూపంలో భారీగా ఇచ్చి ఇలా అయినా ఆ ఆస్తిలో భాగం చేయాలని ఈ పద్దతి మనుగడలోకి వచ్చింది. ఇదే క్రమంలో తాజా ఘటనతో మళ్లీ నాగౌర్ వైభవం మరోసారి చర్చనీయాంశమైంది. చెల్లి పెళ్లిని ఇంత ఘనంగా చేసిన ఈ ముగ్గురు అన్నదమ్ములు మరోసారి మైరాను అంతటా చర్చనీయాంశంగా మార్చారు.