మనలో చాలా మందికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టమే కాదు ప్రాణం కూడా.. చాలా మంది కుక్కలు, పిల్లులు, చిలుకలు వంటి వివిధ జంతువులను పెంచుకుంటారు. ఈ పెంపుడు జంతువులను ఇంట్లో ఓ సభ్యుడిలా చూసుకుంటారు పెట్ ఓనర్స్. ఈ జంతువులు కూడా ఇంటి సభ్యులతో ఎంతో ప్రేమతో మెలుగుతాయి. అయితే ఎవరైనా సింహాన్ని ఇంట్లో పెంచుకోవడం ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో దంపతులు ఓ సింహాన్ని తమ ఇంట్లో పెంచుకున్నట్లు తెలుస్తోంది. కుక్క, పిల్లిని ఇంట్లో పెంపుడు జంతువుగా పెంచుకున్నట్లే.. అడవి జంతువు సింహాన్ని వారు ఇంట్లో పెంచుకుంటున్నారు. సింహాన్ని పెంచుకుంటున్నారని చెబితే దాన్ని అందరూ ఈజీగా నమ్మకపోవచ్చు. అయితే ఈ వైరల్ వీడియో చూస్తే మాత్రం సింహాన్ని పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారంటే నమ్మాల్సిందే.
సింహం లాంటి ప్రమాదకరమైన జంతువును పెంపుడు జంతువుగా ఇంట్లో పెంచుకోవడం కలలో కూడా ఊహించలేము కానీ ఈ వీడియో చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఈ వైరల్ వీడియోలో దంపతులు సింహాన్ని పెంచుకుంటోంది. ఆ సింహం కూడా భారీ సైజులో ఉంది. అది దాడి చేస్తే ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదు. అయితే ఆ మహిళ ఇంటికి ఓ అతిథి రాగా.. ఆ సింహం అతనిపై దాడి చేస్తున్న షాకింగ్ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు అందరికీ వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది. ఆ మహిళ అతి కష్టంమీద సింహాన్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తూ, ఆ ఇంటి యజమానులు చివరికి సింహాన్ని వెనక్కి లాగి.. తమ ఇంటికి వచ్చిన అతిథిని అతికష్టం మీద రక్షించారు. సింహం దాడితో ఆ వ్యక్తి కళ్లలో చావు భయం కనిపిస్తోంది. ఇది ఓ రకంగా ఆ వ్యక్తికి పునర్జన్మ అని చెప్పొచ్చు.
ఇంటికొచ్చిన అతిథిపై పెంపుడు సింహం దాడి.. వీడియో
— The Brutal Side Of Nature (@TheBrutalNature) October 13, 2023
ఈ వీడియోను @TheBrutalNature ఖాతా ద్వారా X లో షేర్ చేశారు. అయితే ఈ వీడియోను ఎక్కడ రికార్డు చేశారన్న వివరాలు మాత్రం అందులో లేదు. ఈ వీడియో చూసిన చాలా మంది ఘాటుగా స్పందించారు. అడవిలో స్వేచ్చగా సంచరించే జంతువులను.. ఇంట్లో పెంపుడు జంతువుగా పెంచుకోవడం ఏంటంటూ కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా అతిథి ప్రాణాలు గాల్లో కలిసిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు. వన్యప్రాణులను ఇళ్లలో పెంపుడు జంతువులా పెంచుకోవడం చాలా ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు.