అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్ పక్షుల రెట్టలే కారణం! పరిశోధనలో ఆసక్తికర విషయాలు
అంటార్కిటికా.. ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ప్రాంతం. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఇక్కడ మంచు వేగంగా కరుగుతోంది. అయితే, మంచు కరగడాన్ని వేగవంతం చేసే మరో ఆసక్తికరమైన అంశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదేంటంటే.. పెంగ్విన్‌ల రెట్టలు! పెంగ్విన్‌ల విసర్జితాలు అక్కడి మంచుపై పెరిగే ఆకుపచ్చ ఆల్గే వృద్ధికి సహాయపడుతున్నాయి. ఈ ఆల్గే మంచు రంగును మార్చడమే కాకుండా, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి మంచు వేగంగా కరిగేలా చేస్తుంది.

అంటార్కిటికాలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో కనిపించే ఆల్గే జాతులు ఉన్నాయి. ఇవి మంచు ఉపరితలంపై పెరుగుతాయి. సూర్యరశ్మి, పోషకాలు అందుబాటులో ఉండటాన్ని బట్టి వీటి రంగులు మారుతుంటాయి. అంటార్కిటికాలో వేసవి కాలంలో ఆకుపచ్చ ఆల్గే ఎక్కువగా కనిపిస్తే.. కొన్ని ప్రాంతాల్లో ఎరుపు లేదా పసుపు రంగువి కనిపిస్తాయి. సాధారణంగా తెల్లగా కనిపించే మంచు.. ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. అయితే, ఈ రంగుల మార్పు వల్ల మంచు సూర్యరశ్మిని గ్రహించే విధానంలో మార్పులు వస్తాయి. ఫలితంగా మంచు కరిగే వేగం కూడా పెరుగుతుంది. పెంగ్విన్ రెట్టల్లో ఉండే పోషకాలు ఈ ఆల్గే పెరుగుదలకు దోహదపడుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
పెంగ్విన్‌ల విసర్జితాల్లో ఫాస్ఫేట్.. ఆల్గేకు పోషకం!
కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన అలియా ఖాన్ నేతృత్వంలోని పరిశోధక బృందం అంటార్కిటికా పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతంలో నమూనాలను సేకరించింది. పెంగ్విన్‌ల కాలనీలు ఉన్న ప్రాంతాలతో పాటు, అవి లేని ప్రాంతాల్లోనూ మంచు, ఆల్గే నమూనాలను సేకరించి పరిశీలించారు. పెంగ్విన్‌ల రెట్టలు ఎరుపు రంగు ఆల్గేను పోలి కనిపించడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అంతేకాదు, పెంగ్విన్‌లు విసర్జించిన తర్వాత అదే ప్రాంతంలో తిరుగుతూ ఉండటంతో వాటి రెట్టలు చుట్టుపక్కల మంచుపై వ్యాపిస్తున్నట్లు గమనించారు. ఆకుపచ్చ ఆల్గే ఉన్న మంచులో ఫాస్ఫేట్ అధికంగా కనిపించింది. పెంగ్విన్‌ల రెట్టల్లోనూ ఈ పోషకం ఉంటుంది. అయితే, ఎరుపు ఆల్గే ఉన్న మంచులో ఫాస్ఫేట్ స్థాయులు తక్కువగా ఉన్నాయి.దీంతో సముద్ర ఆహార వ్యవస్థకు, అంటార్కిటికాలోని పర్యావరణానికి మధ్య కీలక సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పెంగ్విన్‌లు, ఇతర సముద్ర పక్షులు చేపలను తింటాయి. వాటి విసర్జితాల ద్వారా ఫాస్ఫేట్ వంటి పోషకాలు మంచుపైకి చేరుతాయి. అవి ఆకుపచ్చ ఆల్గే వేగంగా పెరగడానికి సహాయపడతాయి.
వాతావరణ మార్పుల అంచనాలకు ఈ పరిశోధన ఎందుకు ముఖ్యం?
మంచు తెల్లగా ఉన్నప్పుడు సూర్యరశ్మిలోని అధిక భాగాన్ని తిరిగి ప్రతిబింబిస్తుంది. కానీ ఆల్గే కారణంగా మంచు రంగు మారినప్పుడు సూర్యరశ్మిని గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల మంచు ఉపరితలం ఎక్కువ శక్తిని గ్రహించి వేగంగా కరుగుతుంది.
అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతుంది. ఈ మార్పులను అంచనా వేయడానికి ఇప్పటివరకు పరిగణనలోకి తీసుకోని కొన్ని అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెంగ్విన్‌లు, ఇతర సముద్ర పక్షుల ద్వారా మంచుపైకి చేరే పోషకాలు.. ఆల్గే పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయి. ఆల్గే మంచు రంగును మార్చి సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. తద్వారా మంచు కరిగే ప్రక్రియ వేగవంతం కావచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అంటార్కిటికాలో భవిష్యత్తులో మంచు కరగడం, మంచు లేని భూభాగాలు విస్తరించడం వంటి పరిణామాలను మరింత మెరుగ్గా అంచనా వేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అంటార్కిటికాలో మంచు కరగడంపై వాతావరణ మార్పులతో పాటు అక్కడి జీవుల కార్యకలాపాలు, ఆల్గే పెరుగుదల కూడా ప్రభావం చూపుతున్నాయని ఈ పరిశోధన సూచిస్తోంది. చిన్నగా కనిపించే పెంగ్విన్‌ల రెట్టలు సైతం అక్కడి పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనడానికి ఇది ఆసక్తికర ఉదాహరణ.