Nurse: రోడ్డు ప్రమాదంలో చావు అంచుల్లోకి విద్యార్థి.. ఊపిరిపోసిన ‘నర్సమ్మ’.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

|

Dec 05, 2021 | 7:58 PM

Tamil Nadu Nurse: ఓ యువకుడు స్పృహలేకుండా రోడ్డుపై పడిఉన్నాడు. చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. యువకుడి బైక్ మాత్రం కొంతదూరంలో

Nurse: రోడ్డు ప్రమాదంలో చావు అంచుల్లోకి విద్యార్థి.. ఊపిరిపోసిన ‘నర్సమ్మ’.. ఫిదా అవుతున్న నెటిజన్లు..
Tamil Nadu Nurse Cpr
Follow us on

Tamil Nadu Nurse: ఓ యువకుడు స్పృహలేకుండా రోడ్డుపై పడిఉన్నాడు. చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. యువకుడి బైక్ మాత్రం కొంతదూరంలో పడి ఉంది. అక్కడ సన్నివేశాన్ని పరిశీలిస్తే.. యాక్సిడెంట్ అయిందని అర్ధమవుతోంది. అయితే.. ఇంతలో ఓ నర్సు అక్కడికి చేరుకుంది. ఆలోచించకుండా.. అతని ఛాతీపై ప్రెజర్ చేస్తూ (సీపీఆర్ పద్దతిలో) అతన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందరూ చివరకు ఏమవుతుందోనని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అలా కొన్ని క్షణాల తర్వాత యువకుడు కదలడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నర్సు ధైర్యంతో యువకుడిని రక్షించడం పట్ల అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. సినిమా సన్నివేశాన్ని తలపించే.. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్‌లోని మన్నార్‌గుడి ప్రాంతంలో డిసెంబరు 3న శుక్రవారం సాయంత్రం జరిగింది. మన్నార్ గుడి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో నర్సుగా పని చేస్తున్న వనజ సకాలంలో ఓ నిండు ప్రాణాన్ని కాపాడటంపై అందరూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బైక్‌పై నుంచి పడిపోయిన విద్యార్థి వసంత్‌కు సకాలంలో సేవలందించడం పట్ల పలువురు ఆమెను కొనియాడుతున్నారు.

మన్నార్ గుడి జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ సంవత్సరం క్రితం కాంట్రాక్టు పద్ధతిలో నర్సుగా పనిచేస్తున్న ఎం వనజ శుక్రవారం వారాంతపు సెలవుల సందర్భంగా తన కుటుంబంతో కలిసి కారులో బయల్దేరారు. మధుక్కూర్ నుంచి మన్నార్ గుడి వెళ్తున్న క్రమంలో లెక్కనంపెట్టయ్ వద్ద వసంత్ అనే పాలిటెక్నిక్ విద్యార్థి రోడ్డుపై పడిపోయి ఉండటాన్ని గమనించారు. ఆ విద్యార్థి చుట్టూ ఉన్న జనాన్ని పక్కకు పంపించి.. ఆమె 30 సెకన్లపాటు కార్డియో పల్మనరీ రిససియేషన్ (సీపీఆర్) చేశారు. అనంతరం విద్యార్థి నెమ్మదిగా స్పృహలోకి వచ్చాడు. మరో రెండు నిమిషాలపాటు అదే విధంగా సేవలందించే సరికి అతను నడవగలిగే స్థాయికి చేరాడడంతో.. అతన్ని 108 అంబులెన్సు ద్వారా తంజావూరు వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

వనజ సకాలంలో సేవలందించడంతో.. వసంత్‌కు ప్రాణాపాయం తప్పిందని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ విజయ కుమార్ తెలిపారు. కాగా.. అత్యంత కీలక సమయంలో వనజ.. వసంత్‌ను కాపాడటానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు స్పందింస్తూ.. వనజ సేవలను ప్రశంసిస్తున్నారు. దీంతోపాటు ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్‌ చేయాలని స్టాలిన్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read:

Car Accident: ప్రాణం తీసిన వాటర్ బాటిల్.. కారులో ప్రయాణిస్తుండగా వెంటాడిన మృత్యువు.. చివరకు..

Crime News: కసితీరా.. ఇంట్లో ఆ ఇద్దరినీ అలా చూసిన తండ్రి ఏం చేశాడంటే..?