
నదులు, బావులు లేదా పైప్‌లైన్లు లేని దుర్భర ప్రదేశాలలో మంచినీటి కొరతకు సైన్స్ ఓ వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ సాంకేతికత ద్వారా గాలిలోని తేమను నేరుగా తాగునీరుగా మారుస్తున్నారు. లీటరు నీటి ఉత్పత్తికి కేవలం రూ.3.5 పడుతుండగా, సోలార్ పవర్ ఉపయోగిస్తే ఈ ఖర్చు రూ.1.5 కి తగ్గుతుంది. ఇది కొండ ప్రాంత ప్రజలకు గొప్ప ఉపశమనం.
ఈ వినూత్న పరికరాన్ని అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ అని పిలుస్తారు. వేకువజామున వాతావరణంలోని తేమ ఆకులపై మంచు బిందువులుగా మారే సహజ సూత్రం ఆధారంగానే ఇది పనిచేస్తుంది. ముందుగా ఈ మిషన్ చుట్టూ ఉన్న గాలిని లోపలికి పీల్చుకుంటుంది. ప్రత్యేక ఫిల్టర్ల ద్వారా ధూళి, దుమ్మును తొలగిస్తుంది. శుభ్రం చేసిన గాలిని డ్యూ పాయింట్ వరకు చల్లబరుస్తారు. దీనివల్ల గాలిలోని తేమ అంతా నీటి చుక్కలుగా మారుతుంది. సేకరించిన నీటిని 5-దశల ఫిల్ట్రేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. UV, మినరల్ ఫిల్టర్లను ఉపయోగించి క్రిములను సంహరించి, శరీరానికి అవసరమైన ఖనిజాలను జోడిస్తారు.
పైప్‌లైన్లు వేయడం సాధ్యం కాని లడఖ్, సియాచిన్ వంటి గడ్డకట్టే హిమపాత ప్రాంతాలలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. భారత సరిహద్దు భద్రతా దళాలు తమ తాగునీటి అవసరాల కోసం AWG పరికరాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. కోల్‌కతాకు చెందిన అక్వో వంటి భారతీయ కంపెనీలు రోజుకు 50 లీటర్ల నుండి 1 లక్ష లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే యంత్రాలను తయారు చేస్తున్నాయి.
సాధారణ విద్యుత్‌తో లీటరు స్వచ్ఛమైన నీటిని తయారు చేయడానికి కేవలం రూ.3.5 మాత్రమే ఖర్చవుతుంది. అదే సోలార్ విద్యుత్ ఉపయోగిస్తే ఈ ఖర్చు రూ.1.50 పైసలకు తగ్గుతుంది. కాలుష్యంతో కూడిన గాలి నుండి తయారు చేసిన నీరు సురక్షితమేనా అనే అనుమానం రావచ్చు. అయితే, అధునాతన మల్టీ-స్టేజ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ద్వారా బ్యాక్టీరియా, హానికర రసాయనాలను పూర్తిగా తొలగిస్తారు. కాబట్టి ఈ నీరు సాధారణ RO నీటి కంటే కూడా 100శాతం స్వచ్ఛమైనది. సురక్షితమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..