భువనేశ్వర్: పెళ్లి విందులో మటన్ కూర వేయలేదని మగ పెళ్లి వారు హల్‌చల్ చేశారు. ఆడపెళ్లివారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చేసేదిలేక రాత్రి వేళ ఆడపెళ్లివారు రెస్టారెంట్లన్నీ తరిగి మటన్ తెచ్చిమరీ వడ్డించారు. దీంతో గొడవ సర్దుమనిగిందనే అనుకన్నారంత. ఐతే ఆ తర్వాత వధువు ఇచ్చిన ట్విస్ట్‌కి మగపెళ్లివారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ వింత ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన యువతి, సుందర్‌గడ్‌కు చెందిన యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. వధువు తరపువారు ఎంతో శ్రద్ధగా పెళ్లి విందులో రకరకాల వంటకాలు సిద్ధం చేసి పెట్టారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. అప్పుడే వచ్చిన పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లి వేదిక వద్దకు చేరుకుంది. ఇక పెళ్లికి వచ్చిన వారంతా భోజనానికి ఎగబడ్డారు. మటన్ కూర ఉండటంతో అందరూ ఆవురావురమని తిన్నారు. చివరలో ఓ ఐదారుగురికి మాత్రం మటన్ ముక్క దక్కలేదు. దీంతో తమకు మటన్ తీసుకురావాలని వరుడు తరపు బంధువులు డిమాండ్ చేశారు. లేదంటే పెళ్లి రద్దు చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.
దీంతో చేసేది లేక ఆడపెళ్లివారు రాత్రికిరాత్రే సమీప రెస్టారెంట్ నుంచి మటన్ తీసుకువచ్చి వారికి వడ్డించి తృప్తి పరిచారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ మటన్ గోల తెలుసుకున్న పెళ్లి కూతురు.. కేవలం మటన్ లేదని తన తల్లిదండ్రులను అవమానించారని ఏకంగా పెళ్లినే రద్దు చేసింది. వరుడు కాళ్లవేల్లాపడ్డా వధువు కనికరించలేదు. జరిగిన దానికి క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఐనా వధువు పెళ్లికి ససేమిరా అంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. మగపెళ్లి వారి అహంకారాన్ని సరైన గుణపాఠం చెప్పిందంటూ పలువురు వధువు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.