
Trending: అతడు ఓ సాధారణ గొర్రెల కాపరి.. ఎప్పట్లానే మేత మేపేందుకు తన జీవాలను తోలుకుని వెళ్లాడు. అయితే అనుకోకుండా అతడికి పురాతన బంగారు నాణేలు దొరికాయి. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. హమీర్‌పూర్(hamirpur) జిల్లాలోని కెన్ నది ఒడ్డున ఒక గొర్రెల కాపరి మొఘల్ కాలం నాటి బంగారు నాణేలను కనుగొన్నాడు. ఈ వార్త ఆ ప్రాంతంలో దావానంలా వ్యాపించింది. జిల్లా పరిధిలోని పరేహతా గ్రామంలోని కెన్ నది సమీపంలో ఓ గొర్రెల కాపరి తన మేకలు, గొర్రెలను మేపుతున్నాడు. ఈ సమయంలో, అతనికి దూరం నుంచి మట్టిలో మెరుస్తూ ఏదో వస్తువు కనిపించింది. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ బంగారు నాణేలు ఉన్నాయి. దీంతో అతడి అనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ఆ గోల్డ్ కాయిన్స్‌పై అరబిక్, పర్షియన్ భాషలో ఏదో రాసి ఉంది. అయితే దొరికిన నాణేల గురించి గ్రామస్తులకు చెప్పాడు ఆ కాపరి. ఇంకేముంది జనం నాణేలను వెతికేందుకు ఆ ప్రాంతానికి క్యూ కట్టారు. విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెంటనే అలెర్టయిన సిసోలార్ పోలీసులు.. గొర్రెల కాపరి నుంచి పదకొండు బంగారు నాణేలను స్వాధీనం చేసుకుని విచారణ కోసం జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపారు. మొత్తం 11 నాణేలను స్వాధీనం చేసుకున్నామని, వీటిని జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు పంపామని సిసోలార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దినేష్ కుమార్ సైనీ తెలిపారు. విచారణ తర్వాతే ఈ నాణేలు ఏ కాలానికి చెందినవో తేలుతుందని అధికారులు తెలిపారు.
అదే సమయంలో నది ఒడ్డున బంగారు నాణేలు దొరకడంతో ప్రజల్లో కలకలం రేగింది. గోల్డ్ కాయిన్స్ దొరికిన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకుంటున్నారు. దీంతో, పోలీసులు ఆ స్థలాన్ని పూర్తిగా సీల్ చేశారు. ఎవరినీ అక్కడికి వెళ్లనివ్వడం లేదు. ఎవ్వరూ ఆ ప్రాంతంలో సంచరించకుండా భద్రతను ఏర్పాటు చేశారు.
Gold Coins
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..