Viral: మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతుండగా బయటపడిన పురాతన కుండ – లోపల

బిజనౌర్ జిల్లా నహ్టౌర్ మండలంలోని ఖండసాల్ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటేందుకు గుంత తవ్వుతుండగా పురాతన నాణేలు ఉన్న కుండ బయటపడింది. అందులో 40 నాణేలుండగా, అవి మొగల్ కాలం నాటివిగా భావిస్తున్నారు. అయితే ఆ నాణేలు ఏ లోహంతో చేశారో ఇంకా తెలియరాలేదు.

Viral: మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతుండగా బయటపడిన పురాతన కుండ - లోపల
Coins Found

Updated on: Jul 06, 2025 | 4:35 PM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బిజనౌర్ జిల్లా నహ్టౌర్ సమీపంలోని ఖండసాల్ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటేందుకు భూమి తవ్వుతుండగా ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. శుక్రవారం సాయంత్రం గ్రామ సమాజ భూమిలో కూలీలు గుంతలు తవ్వుతుండగా.. ఒక్క గుంతలో మట్టితో చేసిన ఒక పాత కుండ కనిపించింది. దానిలో లోహంతో తయారైన 40 నాణేలున్నాయి. ఇవి మొగుల్ కాలం నాటివిగా కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామ ఉపసర్పంచ్ యోగేష్ కుమార్ వెంటనే అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సమక్షంలో నాణేల్ని స్వాధీనం చేసుకుని నహ్టౌర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి భద్రపరిచారు. మెరుస్తూ ఉన్న ఆ నాణేలపై ఉర్దూలో అక్షరాలు ఉన్నట్లు గుర్తించగా, అవి మొఘల్ కాలానికి చెందినవైయుండే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ అంశంపై అధికారులు పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చి పూర్తి విశ్లేషణకు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

“బయటపడ్డ ఈ 40 నాణేలు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యమున్నవిగా భావిస్తున్నాం. ఇప్పటికే పురావస్తు శాఖను అప్రమత్తం చేశాం. నాణేల వివరాలపై పూర్తి పరిశీలన చేపడతారు.” అని ధాంపూర్ పోలీస్ శాఖాధికారి అభయ్ కుమార్ పాండే చెప్పారు. అయితే, నాణేలు ఏ లోహంతో తయారయ్యాయో తెలియాల్సి ఉంది. పురావస్తు శాఖ పరీక్ష అనంతరం స్పష్టత రానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.