అభిషేకాలు, అర్చనలూ, నైవేద్యాలు, కానుకలూ.. భక్తిని ప్రకటించడంలో ఇవన్నీ మార్గాలు. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికున్న దగ్గరిదారులు. ఇష్టదైవానికి తృణమో పణమో సమర్పించుకుంటే ఇంకెంత పుణ్యం.. ఇంకెంత పురుషార్థం..? అందుకే… మన భక్తి సబ్జెక్ట్‌లో దేవుడి హుండీకి అంత గొప్ప ప్రయారిటీలుంటాయ్. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్లు… హుండీలో కానుకలు వేస్తుంటారు. కొందరైతే నిలువు దోపిడి ఇస్తుంటారు. విన్నపాలు వినవలె అంటూ ఇష్ట దైవానికి అర్జీలు పెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ హుండీలో కానుకల్లో విదేశీ కరెన్సీ, బంగారు బిస్కెట్స్ కూడా కనిపితూ ఉంటాయి. తమ పేర్లు బయటకు రాకుండా అజ్ఞాత భక్తులు ఇలా చేస్తుంటారు. మరికొన్నిసార్లు.. కరెన్సీ నోట్లపై లేదా చీటిల్లో తమ కోరికలు రాసి హుండీల్లో వేస్తుంటారు. కానుకల లెక్కింపు సందర్భంగా వాటిని చదివి ఆలయ సిబ్బంది నోరెళ్లబెడుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలో వెలుగుచూసింది.
తాజాగా కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకా ఘత్తరగి గ్రామంలోని భాగ్యవంతి దేవి టెంపుల్ హుండీ లెక్కింపు చేపట్టారు ఆలయ నిర్వాహకులు. నగదు లెక్కపెడుతండగా.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ కంగుతిన్నారు. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని రూ.20 నోటుపై రాసి ఉంది. అత్త చావును అంతలా ఆకాంక్షిస్తున్నది అల్లుడా, కోడలా అనే చర్చ మొదలైంది. సంవత్సరానికి ఒకసారి గ్రామంలోని ఈ ఆలయ హుండీల్లో నగదు లెక్కిస్తారు. ఈ ఏడాది రూ.60 లక్షల డబ్బు, ఒక కిలో వెండి వస్తువులు కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి