కూరగాయలు కొన్నట్లు బంగారం కొంటున్న చైనా జనం.. గోల్డ్ షాపుల్లో రద్దీ!
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో చైనాలోని షెన్‌జెన్ గోల్డ్ మార్కెట్‌లో రద్దీ పెరిగింది. దారులన్నీ జనంతో కిక్కిరిసిపోగా కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో చైనాలోని షెన్‌జెన్ గోల్డ్ మార్కెట్‌లో రద్దీ పెరిగింది. దారులన్నీ జనంతో కిక్కిరిసిపోగా కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బంగారం ధర తగ్గడంతో కొనుగోలుదారులు పరుగులు
చైనా షెన్‌జెన్ నగరంలోని షుయ్‌బెయ్ బంగారం మార్కెట్‌లో భారీగా రద్దీ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో తక్కువ ధరకు పసిడి కొనుగోలు చేయాలనుకున్నవారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో దుకాణాలు, మార్కెట్ మార్గాలు కొనుగోలుదారులతో నిండిపోయాయి. మార్కెట్‌లో రద్దీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చైనా సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. బంగారం మార్కెట్ కళకళలాడుతోందని, కొనుగోలుదారులతో కిటకిటలాడుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ధరలు పెరుగుతున్న సమయంలో కొనుగోలును వాయిదా వేసుకున్నవారు.. ఇప్పుడు ధరలు తగ్గడంతో కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.
I have posted Shuibei video for a few years, but have never seen so much traffic on a weekend. Reports in Chinese media are saying the market is so busy that staff do not even have time for lunch
The price pull back is attracting people with hard demand (eg wedding) to come out shopping during this dip
— David Lee (@DavidLe76335983) October 25, 2026
ఔన్సు బంగారం ధర 4,000 డాలర్ల దిగువకు
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర గణనీయంగా తగ్గింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,000 డాలర్ల కీలక స్థాయి దిగువకు పడిపోయి, 3,995.63 డాలర్ల వద్ద ముగిసింది. అంతకుముందు ధరతో పోలిస్తే 0.72 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన ఈ మార్పు చైనాలోని బంగారు ఆభరణాల ధరలపైనా ప్రభావం చూపింది. దీంతో ధరలు మరింత తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్నవారు కొనుగోళ్లకు ముందుకొచ్చారు. అక్టోబర్ 24న చైనాలోని పలు ప్రముఖ ఆభరణాల బ్రాండ్లు బంగారు ఆభరణాల ధరలను గ్రాముకు 6 నుంచి 12 యువాన్ల వరకు తగ్గించాయి.
చైనాలో షుయ్‌బెయ్ మార్కెట్ ఎందుకంత ప్రత్యేకం?
షెన్‌జెన్ నగరంలోని లూహు జిల్లాలో ఉన్న షుయ్‌బెయ్ మార్కెట్ చైనాలోని అతిపెద్ద బంగారం, ఆభరణాల వ్యాపార కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ టోకు వ్యాపారులు, రిటైలర్లు, ఆభరణాల తయారీదారులు, సాధారణ కొనుగోలుదారులు లావాదేవీలు జరుపుతారు. ప్రపంచ ఆభరణాల సరఫరా వ్యవస్థలో ఈ మార్కెట్‌కు కీలక స్థానం ఉంది. అక్టోబర్ మొదట్లో చైనా జాతీయ దినోత్సవ సెలవుల సమయంలోనూ ఈ మార్కెట్‌కు భారీగా జనం వచ్చారు. ఆ సమయంలో రోజువారీ సందర్శకుల సంఖ్య 60,000కు చేరింది. ఇక గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 28 శాతం పెరిగాయి.
చైనాలో బంగారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆభరణాలుగా ధరించడంతో పాటు, భవిష్యత్తు అవసరాల కోసం విలువైన ఆస్తిగా పసిడిని కొనుగోలు చేస్తారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లకు ఇంతలా ఆసక్తి పెరగడానికి ఇదీ ఓ కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో చైనాలోని షుయ్‌బెయ్ మార్కెట్‌లో కొనుగోళ్ల సందడికి మొదలైంది. ధరలు తగ్గినప్పుడు బంగారం కొనాలనే ఆసక్తి ఎంత బలంగా ఉంటుందో ఈ మార్కెట్‌లో కనిపించిన రద్దీ స్పష్టం చేస్తోంది.
చైనాలో బంగారం ధరలు తగ్గుతాయని చాలా మంది ఎదురుచూస్తుంటారు. తమకు నచ్చిన ఆభరణాలను ముందుగానే ఎంపిక చేసుకుని, ధర తగ్గగానే కొనుగోలు చేస్తారు. భవిష్యత్తులో బంగారం విలువ మరింత పెరుగుతుందనీ నమ్మేవాళ్లూ ఉన్నారు. పెట్టుబడిగా బంగారు ఆభరణాలు కొనే యువత సంఖ్య చైనాలో పెరుగుతోంది.
బంగారంపై ఈ స్థాయిలో ఆసక్తి పెరగడానికి అది ఆభరణంగానే కాకుండా, సంపదను దాచుకునే పెట్టుబడి మార్గంగా కూడా ఉపయోగపడటమే ప్రధాన కారణం. చైనాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బలహీనపడటం, స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గడం వంటి పరిణామాలతో కొందరు తమ పొదుపును ఇతర మార్గాల్లో పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు కూడా బంగారంపై ఆకర్షణను పెంచుతున్నాయి.