సాధారణంగానే మన అందరి ఇళ్లలోనూ మనవడు, మనవరాలు అంటే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలకు ఎనలేని ప్రేమ, అనురాగం. ఇక తాతా మనవడి మధ్య అనురాగం వెలకట్టలేనిది. మనవడితో పాటు ఆ తాతయ్య కూడా చిన్నపిల్లవాడిగా మారిపోతాడు. మనవడితో కలిసి ఆడుతూ పాడుతూ తమ వృద్ధాప్యాన్ని కూడా మర్చిపోతుంటారు. అలాంటిది ఓ తాతయ్యకు తీరని దుంఖం ఎదురైంది. తన నాలుగేళ్ల మనవడు ప్రమాదవశాత్తు వీరుంటున్న అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుండి కిందపడి మరణించాడు. దాంతో ఆ తాతయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గత నాలుగేళ్లుగా మనవడి జ్ఞాపకాలతోనే గడుపుతున్నాడు.. చివరకు ఆ 69ఏళ్ల తాతయ్య కూడా అపార్ట్‌మెంట్ 8 అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు రాజధాని చెన్నైలోని వెప్పరిలో 69 ఏళ్ల వ్యక్తి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. మనవడు చనిపోవడంతో మనస్తాపానికి గురైన 69 ఏళ్ల వృద్ధుడు తన అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు. 69 ఏళ్ల కటోథియా అనే వృద్ధుడు చెన్నైలోని వేప్పేరికి చెందినవాడు. అదే ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అతను వ్యాపారవేత్త. వేప్పరిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని 8వ అంతస్తులో భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉండేవాడు.
అతని పెద్ద కూతురు కొడుకు నాలుగేళ్ల దర్శన్ అంటే అతనికి ఎంతో ఇష్టం. సమయం దొరికిన ప్రతి సారి మనవడితోనే కాలక్షేపం చేసేవాడు. అయితే, 2020లో ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు దర్శన్ 8వ అంతస్తులోని అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి పడిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కటోథియా తన మనవడి మరణాన్ని తట్టుకోలేక పోయాడు. రోజులు గడుస్తున్నప్పటికీ అతడు ఆ బాధలోంచి బయటపడలేక పోయాడు. ఎంతమంది వైద్యులకు చూపించినా, ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఎప్పుడూ మనవడితో మాట్లాడుతున్నట్టుగానే ఉండేవాడని, ఇంట్లో అందరూ నిద్రపోయిన తరువాత బాల్కనీలో ఒక్కడే నిశ్శబ్ధంగా కూర్చోవటం చేసేవాడని, ఈ బాల్కనీ తన మనవడిని బలితీసుకుందని ఎప్పుడూ ఆవేదనగా ఉండేవాడని కుటుంబ సభ్యులు వివరించారు.
ఈ క్రమంలోనే డిసెంబర్ 18 రాత్రి ఎప్పటిలాగే భార్య, కూతురితో కలిసి భోజనం చేశాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో జంబలాల్ అపార్ట్ మెంట్ 8వ అంతస్తు నుంచి ఒక్కసారిగా దూకేశాడు. పెద్ద శబ్ధం రావడంతో అది విన్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడు కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు,అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్యులు అప్పటికే కటోథియా మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వేప్పరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనవడు చనిపోవడంతో మనస్తాపానికి గురైన 69 ఏళ్ల వృద్ధుడు తన నివాసంలోని 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చెప్పారు.
ఈ మేరకు తమిళ్ టీవీ9 ఓ కథనాన్ని ప్రచురించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి