Watch Video: హమ్మయ్య.. నా ఫోన్‌ పాపాలన్నీ మటాష్.. మహా కుంభమేళాలో మొబైల్‌ ఫోన్‌కు పవిత్ర స్నానం! వీడియో

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి తన పెట్ డాగ్‌ను గంగానదిలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తే.. మరో వ్యక్తి ఏకంగా తన మొబైల్‌ ఫోన్‌ను నీళ్లలో ముంచి స్నానం చేయించాడు. పైగా అక్కడకు వచ్చే వారంతా తమ ఫోన్లు కూడా ఇలా నీళ్లలో ముంచితే ఫోన్‌ ద్వారా చేసిన పాపాలన్నీ ప్రక్షాలన అవుతాయని చెబుతున్నాడు..

Watch Video: హమ్మయ్య.. నా ఫోన్‌ పాపాలన్నీ మటాష్.. మహా కుంభమేళాలో మొబైల్‌ ఫోన్‌కు పవిత్ర స్నానం! వీడియో
Man And His Mobile Phone Take Holy Dip

Updated on: Feb 16, 2025 | 12:32 PM

ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 16: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు అక్కడికి చేరుకుని త్రివేణి సంగమంలో మునకలేస్తున్నారు. ఇక్కడ పుణ్య స్నానం ఆచరిస్తే పాపాలన్నీ ప్రక్షాలన అవుతాయని భక్తుల నమ్మకం. కొందరైతే ఏకంగా మరణించిన తమ తల్లిదండ్రుల ఫోటోను తీసుకొచ్చి ఇక్కడి నిళ్లలో ముంచి స్నానం చేపిస్తుంటే.. మరికొందరు తమ పెంపుడు కుక్కలను కూడా త్రివేణి ఘాట్‌లో ముంచిలేపుతున్నారు. అ క్రమంలో ఓ వ్యక్తి అంతకు మించిన విచిత్రం చేశాడు. ఇతగాడు చేసిన పనికి అంతా నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఘాట్‌ వద్ద కొందరు వ్యక్తులు నీళ్లలో పుణ్యస్నానాలు చేయడం కనిపిస్తుంది. అయితే వీరిలో కువార్ కౌశల్ సాహు అనే వ్యక్తి ముందుగా నీళ్లలో మూడు సార్లు మునిగాడు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్‌ కూడా బయటకు తీసి.. ఇది కూడా చాలా పాపాలు చేసిందని, దానికి శుద్ధి అవసరమని చెప్పి.. అనంతరం ఖరీదైన ఆ ఫోన్‌ను త్రివేణి సంగమం నీళ్లలో మూడు సార్లు ముంచి లేపాడు. దీంతో అతడి చుట్టుపక్కలున్న జనాలు స్నానాలు చేయడం మాని.. అతగాడి గణకార్యాన్ని నోరెళ్లబెట్టి చూడసాగారు. మొబైల్‌ ఫోన్‌కు పవిత్ర స్థలంలో పవిత్ర స్నానం చేస్తున్న ఈ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఫోన్‌కు పవిత్ర స్నానం చేయించిన వ్యక్తి స్నేహితులు ఈ మొత్తం తంతును వీడియో తీయగా.. దానిని అతగాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘మొబైల్ కూడా అనేక పాపాలకు బాధ్యత వహిస్తుంది’ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. అంతేకాకుండా మహా కుంభమేళాకు వెళ్ళేవాళ్లంతా తమ ఫోన్‌లను కూడా గంగానదిలో స్నానం చేయాలని సిఫార్సు చేశాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఎన్ని పాపాలు చేసే వారైనా తమ ఫోన్‌ను నీళ్లలో ముంచే సాహసం చేయరు అని ఒకరు, ఈ దెబ్బతో అతడి మొబైల్‌కి శాశ్వతంగా మోక్షం లభిస్తుందని మరొకరు, క్రోమ్ బ్రౌజర్ పాపాలను కూడా కడిగేసినట్లున్నాడు అని ఇంకొకరు సరదాగా కామెంట్లు పెట్టారు. చాలా మంది ఈ వైరల్ వీడియోకు నవ్వుతున్న ఎమోజీలను జోడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.