Bride Cheating:పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా ఎంతో స్పెషల్. భాగస్వామి గురించి అందరికీ కలలు ఉంటాయి. అర్థం చేసుకునే వ్యక్తి కావాలి.. ప్రేమగా చూసుకోవాలి.. సర్దుకుపోవాలి.. ఇలా ఒక్కొక్కరి ఒక్కో వెర్షన్. తాజాగా ఓ వ్యక్తి ఎంతో ప్రేమతో ఓ అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. కోటి ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఆనందంతో భార్యను తీసుకుని సొంతూరు బయలుదేరాడు. కానీ పెళ్లి రోజే అతడికి ఊహించని షాక్ తగిలింది. దారి మధ్యలనే డబ్బు, నగలతో ఉడాయించింది వధువు. దీంతో కాసేపు వరుడు తరుఫువారికి ఏమీ అర్థం కాలేదు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో వెల్లడైన నిజాలు తెలిసి.. పెళ్లి కొడుక్కి మైండ్ బ్లాంక్ అయ్యింది. అతడేమీ ఫస్ట్ కాదు.. ఇలానే ఆ కి’లేడీ’ మరో ఏడుగురిని పెళ్లాడి.. నిండా ముంచేసి వెళ్లిపోయిందట. వివరాల్లోకి వెళ్తే.. దశరథ్ పటేల్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్(Madhya Pradesh) సియోని జిల్లా(Seoni District)లో నివసించేవాడు. ఇటీవలే అతడికి అర్చన అనే 40 ఏళ్ల మహిళ పరిచమైంది. తన బంధువుల అమ్మాయి అని చెప్పి ఊర్మిళా అహిర్వార్(28) అలియాస్ రేణు రాజ్‌పుత్‌తో దశరథ్ పెళ్లి కుదిర్చింది అర్చన. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
సియోని పొరుగు జిల్లా జబల్పుర్లో గత మంగళవారం దశరథ్-ఊర్మిళ పెళ్లి జరిగింది. వధువు తరుఫు నుంచి అర్చన, అమర్ సింగ్(50), హాజరయ్యారు. పిల్లను ఇస్తున్నారు.. మంచి చెడ్డలు చూడాల్సిన వాళ్లు. దీంతో వారిని పూర్తిగా నమ్మిన దశరథ్.. తన దగ్గరున్న డబ్బు, నగలను ఊర్మిళ, అమర్ దగ్గర ఉంచమని ఇచ్చాడు. భార్యతో కలిసి తన ఇంటికి బయలుదేరాడు దశరథ్. కాస్త దూరం వెళ్లాక వాహనం ఆపమని అడిగింది ఊర్మిళ. తనకు ఒంట్లో నలతగా ఉందని, ఒకసారి కిందకు దిగుతానని చెప్పింది. అదే సమయానికి భాగ్‌చంద్ కోరి(22) అనే యువకుడు బైక్‌పై అక్కడికి వాయు వేగంతో వచ్చాడు. వెంటనే కారులోని డబ్బు, నగలు తీసుకున్న ఊర్మిళ.. భాగ్‌చంద్ బైక్‌పై ఎక్కి క్షణాల్లో అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది.
కాసేపటికి విషయం అర్థం చేసుకున్న దశరథ్.. దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి.. గురువారం ఊర్మిళ అలియాస్ రేణు రాజ్‌పుత్, అర్చన, భాగ్‌చంద్, అమర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇలానే ఏడుగురిని మోసగించి, పెళ్లి చేసుకుని.. డబ్బు, నగలతో పరారైనట్లు విచారణలో ఊర్మిళ ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. బాధితులంతా రాజస్థాన్‌లోని జైపుర్, కోట, ధోల్‌పుర్, మధ్యప్రదేశ్‌లోని దామోహ్, సాగర్‌కు చెందిన వారని వెల్లడించారు.
Also Read: తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్..