పోయిందనుకున్న బంగారం వెతుక్కుంటూ వచ్చింది.. దుబాయ్‌లో భారతీయ మహిళకు ఊహించని షాక్..

పోగొట్టుకున్న వస్తువు దొరికితేనే మహాప్రసాదం అనుకుంటాం.. అలాంటిది మన చేతులతోనే చెత్తలో విసిరేసిన లక్షల రూపాయల బంగారం తిరిగి వస్తుందని ఎవరైనా ఊహిస్తారా..? దుబాయ్‌లో ఓ భారతీయ మహిళకు సరిగ్గా ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. పోయింది అనుకున్న బంగారం.. పోలీసులే వెతుక్కుంటూ వచ్చి ఇవ్వడం చూసి ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది.

పోయిందనుకున్న బంగారం వెతుక్కుంటూ వచ్చింది.. దుబాయ్‌లో భారతీయ మహిళకు ఊహించని షాక్..
Indian Woman Lost Gold In Dubai Trash

Updated on: Feb 10, 2026 | 4:23 PM

దుబాయ్‌లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగుచూసింది. పొరపాటున చెత్తబుట్టలో వేసిన లక్షల విలువైన బంగారాన్ని పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి యజమానికి అప్పగించారు. ఈ ఘటనలో ఆసక్తికరమైన మలుపులు చోటుచేసుకున్నాయి. భారత్‌కు చెందిన గామిని కన్నన్ అనే మహిళ ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆమె సోదరికి సంబంధించిన 8 గ్రాముల బంగారు నాణెం, 50 గ్రాముల బంగారు కడ్డీని ఒక చిన్న సంచిలో ఉంచి డైనింగ్ టేబుల్‌పై పెట్టారు. అయితే ఇంటిని శుభ్రం చేసే క్రమంలో ఆమె కుమారుడు అభిమన్యు, ఆ సంచిని చెత్త అనుకుని పొరపాటున డస్ట్‌బిన్‌లో పడేశాడు.

పోయిన ఆశలు.. అంతలోనే..

ఫిబ్రవరి 1న ఆభరణాల సంచి కనిపించడం లేదని గుర్తించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోయిన బంగారం విలువ సుమారు రూ. 12.35 లక్షలు. ఇప్పటికే ఆ చెత్తను మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లిపోవడంతో అది మళ్లీ దొరుకుతుందనే ఆశను వారు వదిలేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా వృధా అని భావించారు. కానీ ఊహించని విధంగా మూడు రోజుల తర్వాత వారికి భవనం సెక్యూరిటీ గార్డు నుండి ఫోన్ వచ్చింది. ఎవరో పోలీసులు వచ్చి బంగారం గురించి విచారిస్తున్నారని చెప్పడంతో అభిమన్యు వెంటనే అక్కడికి వెళ్లారు. అక్కడ తెలిసిన విషయం విని వారు ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

చెత్త సేకరించే వ్యక్తికి ఆ బంగారం దొరకగా, అతను దాన్ని ఒక నగల షాపుకు తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌లో వ్యర్థాల నిర్వహణ అత్యంత ఆధునిక పద్ధతిలో ఉంటుంది. ఏ చెత్త సంచి ఏ భవనం నుండి, ఏ ఫ్లాట్ నుండి వచ్చిందో ట్రాక్ చేసే టెక్నాలజీ ఉండటంతో పోలీసులు నేరుగా గామిని ఉంటున్న భవనానికి చేరుకున్నారు. బంగారానికి సంబంధించిన కొనుగోలు పత్రాలను పోలీసులకు చూపించడంతో వారు అన్ని వివరాలు సరిచూసుకుని ఆ నగలను గామిని కుటుంబానికి అప్పగించారు. ‘‘చెత్తలో పోయిన బంగారం తిరిగి దొరుకుతుందని అస్సలు అనుకోలేదు.. దుబాయ్ పోలీసుల టెక్నాలజీ, నిజాయితీకి హ్యాట్సాఫ్’’ అంటూ గామిని కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.