లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటో తెలుసా..? ఒక్కటే అనుకునేరు..
కోర్టు, కేసులు, స్టేషన్ చుట్టూ తిరిగేటప్పుడు మనం తరచుగా ఉపయోగించే మాటలు.. లాయర్, అడ్వకేట్. సాధారణంగా కోర్టులో నల్లటి కోటు వేసుకుని కనిపించే ప్రతి ఒక్కరినీ ఈ రెండు పేర్లతోనూ పిలిచేస్తుంటాం. వీరిద్దరూ ఒకటే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ చట్టం ప్రకారం లాయర్, అడ్వకేట్ మధ్య చాలా పెద్ద తేడా ఉంది.

కోర్టు కేసులు, చట్టపరమైన వివాదాలు తలెత్తినప్పుడు మనకు ఎక్కువగా వినిపించే మాట లాయర్, అడ్వకేట్. సాధారణంగా కోర్టులో నల్లటి కోటు వేసుకుని కనిపించే ప్రతి ఒక్కరినీ ఈ రెండు పేర్లతోనూ పిలిచేస్తుంటాం. చాలా మంది ఈ రెండు పదాలకు ఒకే అర్థం ఉందని, ఇద్దరూ ఒక్కటేనని అనుకుంటారు. కానీ భారతీయ చట్టాల ప్రకారం లాయర్, అడ్వకేట్ మధ్య చాలా పెద్ద తేడా ఉంది. వీరి విధులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. గుర్తింపు పొందిన లా కాలేజీ నుండి మూడు లేదా ఐదేళ్ల న్యాయశాస్త్ర కోర్సు పూర్తి చేసి, డిగ్రీ సర్టిఫికేట్ పొందిన వారిని లాయర్ అంటారు. అంటే వీరు చట్టాన్ని అధికారికంగా చదివిన అభ్యర్థులు. వీరికి చట్టంపై పూర్తి అవగాహన, పట్టు ఉంటాయి. వీరు మీకు చట్టపరమైన సలహాలు ఇవ్వగలరు. అలాగే కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లను, పత్రాలను సిద్ధం చేయగలరు. అయితే లాయర్ పట్టా ఉన్నంత మాత్రాన మీ తరఫున కోర్టుకు వెళ్లి, న్యాయమూర్తి ముందు నిలబడి కేసును వాదించడానికి వీరికి చట్టపరమైన హక్కు ఉండదు.
అడ్వకేట్ అంటే ఎవరు?
అడ్వకేట్ అనే వ్యక్తి లాయర్ కంటే ఒక మెట్టు పైన ఉంటారు. న్యాయశాస్త్రం పూర్తి చేసిన తర్వాత దేశంలో ప్రాక్టీస్ చేయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనే ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్న తర్వాతే దేశంలోని న్యాయస్థానాలలో కేసులను వాదించడానికి అధికారిక లైసెన్స్ లభిస్తుంది. ఇలా లైసెన్స్ పొందిన వారిని మాత్రమే అడ్వకేట్ అని పిలుస్తారు. ఒక క్లయింట్ తరఫున కోర్టులో హాజరై, కేసును వాదించే పూర్తి చట్టపరమైన అధికారం వీరికి మాత్రమే ఉంటుంది.
డాక్టర్ ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకోవచ్చు
దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి మెడికల్ కాలేజీలో చదివి MBBS పూర్తి చేయగానే డాక్టర్ అవుతాడు. కానీ అతను అధికారికంగా ఒక ఆసుపత్రిని స్థాపించి లేదా ప్రాక్టీస్ చేస్తూ రోగులకు చికిత్స చేయాలంటే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరి. అదేవిధంగా లా చదివిన ప్రతి ఒక్కరూ లాయర్లు అయినప్పటికీ, కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడి వాదించే అర్హత బార్ కౌన్సిల్ లైసెన్స్ పొందిన అడ్వకేట్‌కు మాత్రమే ఉంటుంది.
చట్టాన్ని చదివిన ప్రతి ఒక్కరూ లాయర్ అవుతారు కానీ అడ్వకేట్ కాలేరు. బార్ కౌన్సిల్ పరీక్ష పాసై లైసెన్స్ తెచ్చుకున్న లాయర్ మాత్రమే అడ్వకేట్ అవుతారు. కాబట్టి మీకు చట్టపరమైన పత్రాల తయారీకి, సలహాలకు లాయర్ అవసరమైతే.. కోర్టులో మీ తరఫున కేసును వాదించి న్యాయం పోరాటం చేయడానికి మాత్రం కచ్చితంగా అడ్వకేట్ అవసరమవుతారు.
