
జపాన్‌కు చెందిన 66 ఏళ్ల వ్యక్తిని అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా 600 మిలియన్ యెన్‌లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 34 కోట్లు లాటరీలో గెలుచుకున్నాడు. కానీ ఆ డబ్బును తన భార్యకు తెలియకుండా దాచిపెట్టి, రహస్యంగా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. టోక్యోలో నివసించే ఎస్ అనే ఈ వ్యక్తికి, కాఫీ షాపులో అల్పాహారం చేశాక లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు ఉండేది. ఉన్నట్లుండి ఒక రోజు అతడికి అదిరిపోయే న్యూస్ తెలిసింది. మెగా లాటరీని గెలిచానని తెలుసుకుని అతను ఆశ్చర్యపోయాడు. కానీ ఈ విషయాన్ని భార్యకు చెప్పలేదు.
ఎస్ భార్యకు ఎందుకు చెప్పలేదంటే.. తన భార్య ఆర్థిక విషయాల్లో కఠినంగా ఉండడమే కారణం. అందుకే కేవలం 5 మిలియన్ యెన్‌లు మాత్రమే గెలిచినట్లకు చెప్పాడు. వచ్చిన మొత్తం చెబితే తీసుకుంటుందని భయపడ్డాడు. ఆ డబ్బును కూడా ఇంటి పునరుద్ధరణకు ఉపయోగిస్తానని అబద్ధం చెప్పాడు. వాస్తవానికి లాటరీ డబ్బుతో ఎస్ ఆరు నెలల్లోనే సుమారు రూ. 1 కోటి ఖర్చు చేశాడు. లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. హాట్ స్ప్రింగ్ రిసార్ట్స్‌లో ఎక్కువగా గడిపేవాడు. జపాన్ అంతటా రహస్యంగా విలాసవంతమైన ప్రయాణాలు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, అతను లగ్జరీ కారును అండర్ గ్రౌండ్ పార్కింగ్‌లో ఉంచడం, పాత బట్టలు ధరించడం, స్నేహితులకు దూరంగా ఉండటం వంటివి చేశాడు.
లాటరీ డబ్బుతో గడిపిన ఈ రహస్య జీవితం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. కొంతకాలానికే ఎస్ తీవ్రమైన అపరాధ భావన, ఒంటరితనానికి గురయ్యాడు. “ఈ డబ్బు నా స్వంత కష్టంతో సంపాదించినట్లయితే నేను గర్వంగా ఉండేవాడిని. కానీ ప్రయత్నం లేకుండా వచ్చిన సంపద అసహ్యకరమైన జ్ఞాపకాలను తెచ్చి, నా జీవితాన్ని కుదిపేసింది” అని ఆయన అన్నారు. తన తండ్రి దివాలా తర్వాత ఒంటరిగా మరణించిన సంఘటనను ఈ సమయంలో ఆయన గుర్తు చేసుకున్నాడు.
చివరికి ఎస్ ఒక ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించి దాదాపు 500 మిలియన్ యెన్‌లను బీమాలో పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బుకు తన భార్య, పిల్లలను లబ్ధిదారులుగా పేర్కొన్నాడు. ‘‘నేను చనిపోయిన తర్వాత ఈ డబ్బు నా కుటుంబానికి భద్రత కల్పిస్తుందని ఆశిస్తున్నాను’’ అని ఆయన చెప్పడం విశేషం. లాటరీ డబ్బుతో రహస్య విలాస జీవితం గడిపినప్పటికీ, చివరకు కుటుంబ భద్రత వైపు మొగ్గు చూపడం గమనార్హం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..