Toilet Water Drinking: జపాన్‌లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఒక ఆసుపత్రిలో దాదాపు 30 సంవత్సరాలుగా టాయిలెట్ నీటినే మంచినీటిగా వినియోగించారు. ఇంతకాలం తాము అన్ని అవసరాలకు వినియోగించింది టాయిలెట్ వాటర్ అని తెలిసి.. ఆస్పత్రి సిబ్బంది, రోగులు షాక్ అయ్యారు. మరోవైపు జరిగిన పొరపాటుకు ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒసాకా విశ్వవిద్యాలయంలో ఆస్పత్రి ఉంది. దీనిని 1993లో నిర్మించారు. అయితే నిర్మాణ దశలో మంచి నీటి సరఫరా పైపులు, టాయిలెట్ పైపుల అనుసంధానంలో పొరపాటు చోటు చేసుకుంది. ఆ విషయం ఎవరికీ తెలియక.. ఇంతకాలం టాయిలెట్ కోసం వినియోగించే వాటర్‌నే వినియోగిస్తూ వచ్చారు. దాదాపు 120 ట్యాప్‌లకు ఈ నీరే సరఫరా అయినట్లు తాజాగా గుర్తించారు. ఇటీవల కొత్త వటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తుండగా.. అసలు లోపాన్ని గుర్తించారు అధికారులు. వాటర్ పైపుల అనుసంధానంలో భారీ పొరపాటు జరిగిందని గమనించారు. వెంటనే ఆ లోపాన్ని సరిచేశారు.
కాగా, ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. నీటి నాణ్యత నిరంతరం పరిశీలిస్తున్నామని, ఇప్పటి వరకు ఈ నీటిలో ఎలాంటి ప్రమాదకరమైన పదార్థాన్ని గుర్తనించలేదని యూనివర్సిటీ అదికారులు చెప్పారు. 2014 నుంచి ప్రతీ వారం నీటి రంగు, రుచి, వాసన కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే, అసలు విషయం ఇప్పుడు వెలుగు చూడటంతో అంతా షాక్ అయ్యారు. అధునాత వైద్యం అందించే యూనివర్సిటీ ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని, ఈ లోపానికి బాధ్యత వహిస్తూ ఒసాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు, ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ కజుహికో నకటానీ క్షమాపణలు చెప్పారు. పైపుల అనుసంధానాన్ని సవరిస్తామని ప్రకటించారు.
Also read:
Benefits of Rose: గులాబీలు అందానికే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఎలా అంటే..
Etela Rajender: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటల రాజేందర్