
నేటి ఆధునిక సమాజంలో యువత అనేక రకాల మానసిక, సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఉద్యోగం, చదువుల ఒత్తిడి ఒకెత్తయితే, సరైన వయసులో వివాహం కాకపోవడం అనేది మరొక పెద్ద సమస్యగా మారుతోంది. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో వెలుగుచూసిన గణాంకాలు సమాజానికే ఒక తీవ్ర హెచ్చరికగా నిలుస్తున్నాయి. అక్కడ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పెళ్లి కాలేదన్న వేదనతో 29 మంది యువకులు తమ జీవితాలను ముగించుకున్నారు.
ఈ ఏడాది జనవరి 1 నుండి జూన్ 30 మధ్య జలగావ్ జిల్లాలో మొత్తం 443 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల్లో మిగిలిన ఆరని శోకం. ఆత్మహత్య చేసుకున్న 443 మందిలో 383 మంది పురుషులు కాగా, 29 మంది మహిళలు ఉన్నారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక 8 మంది బాలురు, 11 మంది బాలికలు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, చదువుల ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలతో పాటు ప్రధానంగా పెళ్లి కాలేదనే నిరాశ వీరిని తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా చేసిందని పోలీసుల విచారణలో తేలింది.
వివాహ వయస్సు దాటిపోవడం, ఉద్యోగం లేదా ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల సరైన భాగస్వామి దొరకకపోవడం వంటి సమస్యలు పురుషులను ఎక్కువగా వేధిస్తున్నాయి. దీనికి తోడు బంధువులు, సమాజం నుండి నిరంతరం ఎదురయ్యే ప్రశ్నలు, హేళనలు వారిని తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెళ్లిని ఒక జీవిత లక్ష్యంగా చిత్రీకరించే సామాజిక దృక్పథం కూడా ఈ ఒత్తిడిని మరింత పెంచుతోంది.
ఇంట్లో ఎవరైనా నిరాశతో ఉంటే కుటుంబ సభ్యులు వారిని అర్థం చేసుకుని, మానసిక ధైర్యాన్ని అందించాలి. చదువు, ఉద్యోగం, పెళ్లి అనేవి జీవితంలో భాగాలు మాత్రమే, అవే పూర్తి జీవితం కాదని యువత గ్రహించాలి.
మానసిక సమస్యలను దాచకుండా వెంటనే మానసిక వైద్యులను లేదా కౌన్సిలర్లను సంప్రదించాలి. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతుంటే భారత ప్రభుత్వం అందించే ఉచిత టెలి-మానస్ హెల్ప్‌లైన్ నంబర్లు 14416 లేదా 1800-891-4416 కు కాల్ చేసి సహాయం పొందవచ్చు.