పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే మీ ప్రాణాలకే రిస్క్..

ఎండలు పెరుగుతున్న కొద్దీ కేవలం మనుషులమే కాదు.. మూగజీవాలు చల్లని ఆశ్రయం కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలోనే విషపూరితమైన పాములు మనకు తెలియకుండానే మన నివాసాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. పాము నేరుగా కనిపిస్తేనే ఇంట్లో ఉందని అనుకోవడం పొరపాటు. అది మీ కంట పడకుండా ఇంట్లోనే ఎక్కడో ఒకచోట దాక్కుని ఉండవచ్చు. అప్పుడు ఎలా గుర్తించాలంటే..?

పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే మీ ప్రాణాలకే రిస్క్..
Signs Of Snakes In House

Updated on: Apr 24, 2026 | 9:40 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు మనుషులే కాదు, జీవరాశులన్నీ అల్లాడిపోతుంటాయి. ముఖ్యంగా భూమి లోపల, బొరియల్లో ఉండే పాములు వేడిని తట్టుకోలేక చల్లని ప్రదేశాల కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలోనే ఆహారం కోసం లేదా చల్లదనం కోసం అవి మన నివాసాల్లోకి, గదుల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. చాలా సందర్భాల్లో పాము ఇంట్లోకి వచ్చిన విషయం మనకు వెంటనే తెలియదు. మనం చూసే వరకు అది అక్కడ ఉందని గుర్తించలేం. అయితే పాము మన కంట పడకపోయినా, అది ఇంట్లోనే ఉందని చెప్పడానికి ప్రకృతి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ సూచనలను ముందే గుర్తిస్తే ప్రమాదం జరగకుండా కాపాడుకోవచ్చు.

అకస్మాత్తుగా వచ్చే వింతైన వాసన

సాధారణంగా పాములు ఒక రకమైన జిగట పదార్థాన్ని, విలక్షణమైన వాసనను విడుదల చేస్తాయి. ట్లోని స్టోర్ రూమ్, చీకటి గదులు లేదా అటకపై అకస్మాత్తుగా ఒక వింతైన, గాఢమైన వాసన వస్తుంటే అప్రమత్తం కావాలి.అది కుళ్ళిన వస్తువు వాసనలా కాకుండా, కొత్తగా, వింతగా అనిపిస్తే ఆ ప్రదేశంలో పాము దాక్కుని ఉండే అవకాశం మెండుగా ఉంది.

వంకరటింకర గుర్తులు

పాములు పాకేటప్పుడు వాటి శరీరం నేలకు రాసుకుపోవడం వల్ల ఒక ప్రత్యేకమైన గుర్తులు ఏర్పడతాయి. మీ ఇంటి ఆవరణలో ఉన్న దుమ్ముపై లేదా తేమగా ఉన్న ప్రాంతాల్లో S ఆకారంలో వంకరటింకర గీతలు కనిపిస్తే అది పాము సంచారానికి నిదర్శనం. ఈ గుర్తులు ప్రతిరోజూ ఒకే చోట కనిపిస్తుంటే ఆ పాము మీ ఇంటి పరిసరాల్లోనే మకాం వేసిందని అర్థం చేసుకోవాలి.

ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా తగ్గిందా..?

మీ ఇంట్లో గతంలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండి, అకస్మాత్తుగా అవి మాయమైతే అది సంతోషించాల్సిన విషయం కాదు. పాములకు ఎలుకలు ప్రధాన ఆహారం. ఇంట్లో పాము ప్రవేశిస్తే ఎలుకలు వాటికి ఆహారంగా మారుతాయి లేదా భయంతో పారిపోతాయి. ఎలుకల సంచారం అకస్మాత్తుగా తగ్గడం అనేది మీ ఇంట్లో ఏదో పెద్ద వేటగాడు ప్రవేశించిందనడానికి బలమైన సంకేతం.

రాత్రిపూట వింత శబ్దాలు

పాములు నిశ్శబ్దంగా వెళ్తాయని మనం అనుకుంటాం, కానీ అవి కదిలేటప్పుడు కొన్ని శబ్దాలు వస్తాయి. పాము ఎండుటాకుల మీద, పాత సామాగ్రి మధ్య లేదా కార్డ్ బోర్డ్ పెట్టెలపై పాకినప్పుడు గలగలమనే శబ్దం వస్తుంది. కొన్నిసార్లు గోడల పగుళ్లలో లేదా పైకప్పు పైన పాము కదులుతున్నప్పుడు గీతలు గీసినట్లుగా శబ్దం వినిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి నిశ్శబ్దంలో ఇలాంటి శబ్దాలు వస్తే నిర్లక్ష్యం చేయకండి.

పాము కుబుసం లేదా విసర్జితాలు

ఇది అన్నిటికంటే స్పష్టమైన ఆధారం. పాములు పెరిగే కొద్దీ తమ పాత చర్మాన్ని వదులుతాయి.ఇంటి మూలల్లో లేదా తోటలో పారదర్శకమైన పొరలాంటి కుబుసం కనిపిస్తే, పాము అక్కడ ఉందనడానికి అది 100శాతం నిజం. పాము విసర్జితాలు పక్షుల విసర్జితాల వలె కనిపిస్తాయి కానీ వాటిలో ఎముకల ముక్కలు లేదా వెంట్రుకలు ఉండే అవకాశం ఉంటుంది.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి..?

  • ఇంట్లో వాడని పాత సామాగ్రిని, చెత్తను పేరుకుపోనివ్వకండి. అవి పాములకు సురక్షితమైన దాగుడు స్థలాలు.
  • కిటికీలు, తలుపుల కింద ఉండే సందులను మరియు గోడల పగుళ్లను సిమెంట్ లేదా పుట్టీతో మూసివేయండి.
  • చీకటిగా ఉండే గదుల్లో, స్టోర్ రూమ్స్ లో అప్పుడప్పుడు వెలుతురు సోకేలా చూడండి. పాములు వెలుతురును ఇష్టపడవు.

ఒకవేళ పామును గుర్తిస్తే, దాన్ని చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకండి. వెంటనే స్నేక్ క్యాచర్ లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి.

Follow Us