AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి మామూలు చీమలు కాదు.. ఒక్కదాని ధర తెలిస్తే మైండ్ బ్లాంకే.. రంగంలోకి విదేశీ గ్యాంగులు..

ఒక్క ఏనుగు దంతం విలువలక్షల్లో ఉంటుంది.. ఒక ఖడ్గమృగం కొమ్ము రేటు కోట్లలో పలుకుతుంది.. కానీ, ఎప్పుడైనా ఒక చిన్న చీమ ధర వేలల్లో ఉంటుందని విన్నారా.. అవును.. మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం కెన్యా అడవుల్లో చీమల కోసం అంతర్జాతీయ ముఠాలు వేట మొదలుపెట్టాయి. అసలు ఈ చీమలను ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారనేది తెలుసుకుందాం..

ఇవి మామూలు చీమలు కాదు.. ఒక్కదాని ధర తెలిస్తే మైండ్ బ్లాంకే.. రంగంలోకి విదేశీ గ్యాంగులు..
Giant African Harvester Ants Smuggling
Krishna S
|

Updated on: Apr 03, 2026 | 5:42 PM

Share

సాధారణంగా వన్యప్రాణుల స్మగ్లింగ్ అంటే మనకు ఏనుగు దంతాలు, ఖడ్గమృగాల కొమ్ములు లేదా పులి చర్మాలే గుర్తొస్తాయి. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ నల్లబజారులో చీమలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశమైన కెన్యాలో రాణి చీమల అక్రమ రవాణా నెట్‌వర్క్ వెలుగులోకి రావడం శాస్త్రవేత్తలను, అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.

ఎందుకు ఈ క్రేజ్?

ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల ప్రేమికుల్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే చీమల పెంపకం. పారదర్శకమైన ప్లాస్టిక్ లేదా గాజు పెట్టెల్లో చీమల కాలనీని ఏర్పాటు చేసి, అవి గూళ్లు కట్టడం, ఆహారం సేకరించడం, రాణిని రక్షించడం వంటివి గమనించడం ఒక వినోదంగా మారింది. ఒక కాలనీ వృద్ధి చెందాలంటే ఫలదీకరణం చెందిన ఒక రాణి చీమ ఉంటే చాలు. అందుకే ఈ రాణి చీమల కోసం స్మగ్లర్లు కక్కుర్తి పడుతున్నారు.

రూ. 21 వేల రారాణి

కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో కనిపించే జెయింట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు ఈ మార్కెట్‌లో అత్యంత ఖరీదైనవి. ఆన్‌లైన్ బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో రాణి చీమ ధర సుమారు రూ. 21,000 వరకు పలుకుతోంది. ఇవి ఎరుపు రంగులో, పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఇవి విత్తనాలను సేకరించే విధానం విలక్షణంగా ఉంటుంది. ఈ రాణి చీమలు దాదాపు 50 నుండి 70 ఏళ్ల వరకు జీవించగలవు. ఇవి చనిపోతేనే ఆ కాలనీ అంతమవుతుంది.

స్మగ్లింగ్ ఎలా జరుగుతోంది?

వర్షాకాలం రాగానే మగ చీమలు, రాణి చీమలు సంభోగం కోసం బయటకు వస్తాయి. ఆ సమయంలో స్మగ్లర్లు పొలాల్లో మాటు వేసి రాణి చీమలను పట్టుకుంటారు.పట్టుకున్న చీమలను సిరంజిలు లేదా టెస్ట్ ట్యూబ్‌లలో ఉంచి, తడి దూదిని ప్యాక్ చేస్తారు. తద్వారా అవి కొన్ని నెలల పాటు సజీవంగా ఉంటాయి. ఇవి సేంద్రీయ పదార్థాలు కావడంతో ఎయిర్‌పోర్ట్ స్కానర్లలో త్వరగా దొరకవు. వీటిని సాధారణ కొరియర్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఇటీవల నైరోబీ ఎయిర్‌పోర్ట్‌లో ఓ చైనా వ్యక్తి వద్ద ఏకంగా 2,000 రాణి చీమలు లభించడం ఈ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పర్యావరణానికి పెను ముప్పు

ఈ అక్రమ వ్యాపారం వల్ల రెండు రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హార్వెస్టర్ చీమలు విత్తనాల వ్యాప్తికి, నేల సారవంతం కావడానికి ఎకోసిస్టమ్ ఇంజనీర్లుగా పనిచేస్తాయి. వీటిని భారీగా తరలిస్తే కెన్యా పచ్చిక బయళ్లు దెబ్బతింటాయి. ఆఫ్రికాకు చెందిన ఈ చీమలు చైనా లేదా యూరప్ దేశాల్లోని అడవుల్లోకి ప్రవేశిస్తే అక్కడ స్థానిక జాతులను అంతం చేసి పంటలను నాశనం చేసే ప్రమాదం ఉంది.

కెన్యా ప్రభుత్వం ఇప్పుడు ఈ జీవవైవిధ్య దొంగతనంపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలువురు విదేశీయులను అరెస్ట్ చేసి భారీ జరిమానాలు విధించింది. అయితే వీటిని అక్రమంగా తరలించడం కంటే శాస్త్రీయ పద్ధతిలో పెంచి ఎగుమతి చేస్తే దేశానికి ఆదాయం వస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us