మన దేశంలో జంతువులను, ప్రకృతిని దేవుళ్లుగా పూజిస్తారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో కుక్కలు, గబ్బిలాలు, పాములను పూజించే ఆచారం కూడా ఉంటుంది. అంతేకాదు, వాటికి ప్రత్యేకించి ఆలయాలు కూడా ఉన్నాయి. అలాంటిదే మరో వింత ఆలయం కూడా మన దేశంలోనే ఉంది. ఇక్కడ పిల్లిని దేవుడిగా పూజిస్తారు. దానికోసం గ్రామంలో పిల్లి దేవాలయం కూడా ఉంది. ఇది మీకు విచిత్రంగా అనిపించినప్పటికీ అలాంటి గుడి కర్ణాటకలో నిజంగానే ఉంది. ఇక్కడ పిల్లినే దేవతగా పూజిస్తున్నారు.
సాధారణంగా పిల్లిని పెంపుడు జంతువుగా, చెడు శకునంగా చూస్తారు. కానీ, కర్ణాటకలోని ఒక గ్రామంలో పిల్లి దేవాలయం ఉంది. అక్కడ దానిని భక్తితో పూజిస్తారు. మాండ్య జిల్లాలోని బెక్కలెలె గ్రామంలో ఈ ప్రత్యేకమైన పిల్లి దేవాలయం ఉంది. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు రోడ్డుకు అడ్డంగా పిల్లి వస్తే అరిష్టం అని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, ఇక్కడ మాత్రం పిల్లులు శుభప్రదమని నమ్మడమే కాకుండా పూజిస్తారు.
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఈ పిల్లి దేవాలయం ఉంది. మాండ్య నగరానికి 35 కిలోమీటర్ల దూరంలోని బెక్కలెలె గ్రామంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం పిల్లులను పూజించే సంప్రదాయం ప్రారంభమైంది. తమ దేవత మంగమ్మ పిల్లి రూపంలో గ్రామంలోకి ప్రవేశించిందని, దుష్ట శక్తుల నుండి తమ గ్రామాన్ని కాపాడుతుందని ఇక్కడి నివాసితులు నమ్ముతారు.
పిల్లిని పూజించే ఈ గ్రామంలో పిల్లికి ఎవరూ హాని చేయరు. అంతే కాకుండా ఈ గ్రామంలో ఎక్కడైనా పిల్లుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు గమనిస్తే స్థానికులు వారిని పట్టుకుని దోషులుగా శిక్షిస్తారు. ఈ గ్రామ పరిసరాల్లో ఎవరైనా పిల్లి చచ్చిపోయి కనిపిస్తే గౌరవంగా పాతిపెట్టే బాధ్యత తీసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ పిల్లి రూపంలో మంగమ్మ పండుగను జరుపుకుంటారు. ఇక్కడి స్థానిక జ్యోతిష్కులు పండుగను నిర్వహించడానికి అత్యంత పవిత్రమైన రోజును నిర్ణయిస్తారు..మంగమ్మ పండుగను అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహిస్తారు. మూడు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగను పట్టణ ప్రజలంతా కలిసి జరుపుకుంటారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..