స్కూల్లోనే గబ్బు పనికి దుకాణం తెరిచారు. పిల్లలు విద్యాబుద్దులు నేర్చుకునే చోట లిక్కర్ దందాకు తెరతీశారు. ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో నడుస్తున్న అక్రమ డిస్టిలరీ గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు. భారీ మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాలోని నుగావ్ బ్లాక్ పరిధిలోని ఫులాజర్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని స్కూల్ యజమాని సురేంద్ర బడైక్, మద్యం వ్యాపారి పవన్ కుమార్ మిట్టల్‌గా గుర్తించారు. ఈ ఇన్సిడెంట్ ఆదివారం వెలుగుచూసింది.
పాఠశాల ఆవరణలో దేశీయ మద్యం తయారీ యూనిట్ పనిచేస్తుండటం.. పోలీసులు, ఎక్సైజ్ శాఖకు దాని గురించి ఎటువంటి సమాచారం ఉండకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలోని ఓ క్లాస్ రూమ్‌లో భారీ మొత్తంలో మద్యం సీసాలు భద్రపరిచినట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందం ఆదివారం ఉదయం పాఠశాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.6 లక్షల విలువైన ముడిసరుకు, ఖాళీ సీసాలు, ప్యాక్ చేసిన బాటిళ్లతో పాటు లిక్కర్ రవాణాకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనిట్ నుంచి సమీపంలోని దాబాలు, హోటళ్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అరెస్టు చేసిన వారిని అదే రోజు కోర్టులో హాజరుపరిచారు. పాఠశాల ఆవరణలో ఇంత కాలం యూనిట్ ఎలా నడుస్తుందో తెలుసుకోవడానికి ఎక్సైజ్ శాఖ విచారణ ప్రారంభించింది.
“పాఠశాలలోని తరగతి గది నుండి మద్యం యూనిట్ పనిచేస్తున్నట్లు మాకు సమాచారం అందినప్పుడు మేము మా సాధారణ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నాము. ఎక్సైజ్ కమీషనర్ ఆశిష్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు మేము పాఠశాలలో దాడి చేసాము” అని రూర్కెలా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ స్నేహలతా నాయక్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి