దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు సహజమే. ఒక పరిధి వరకు అయితే పెద్దగా ప్రమాదమేమీ లేదు. కానీ ఇవి పెద్దవైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. భార్య రోజు కొడుతోందని ఓ భర్త వంద అడుగుల ఎత్తైన తాటిచెట్టు ఎక్కేశాడు. కిందికి రానంటే రానని తేల్చి చెప్పేశాడు. భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, ఆమె నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఈ పని చేసినట్లు వాపోయాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మౌ జిల్లా బసరత్‌పూర్ ప్రాంతానికి చెందిన రాం ప్రవేశ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రాంప్రవేశ్‌ను అతని భార్య తీవ్రంగా కొట్టేది. దీంతో భార్య కొట్టే దెబ్బలకు తాళలేక రాం ప్రవేశ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. గ్రామానికి సమీపంలో ఉన్న వంద అడుగుల ఎత్తున్న తాటి చెట్టు ఎక్కేశాడు. విశ్రాంతి తీసుకునేలా చెట్టుపైనే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. అక్కడే నిద్రపోయేవాడు. ఎవరూ లేని సమయంలో చెట్టు దిగి కాలకృత్యాలు తీర్చుకునేవాడు.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కిందికి రావాలని కోరినా రాం ప్రవేశ్ నిరాకరించాడు. కిందికి వచ్చేది లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో కుటుంబసభ్యులే ఓ తాడుకు బుట్ట కట్టి ఆహారం అందిస్తున్నారు. అలా చెట్టుపైనే తిని పడుకునేవాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో అధికారులు చేరడంతో వారు గ్రామానికి చేరుకున్నారు. రాం ప్రవేశ్‌ను కిందకు దింపేందుకు యత్నించారు. కిందికి దిగుతున్న సమయంతో అతను ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడు. వైద్య చికిత్స కోసం అతనిని ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి