వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? మిల్లిమీటర్, సెంటిమీటర్ల వర్షం వెనకున్న సీక్రెట్స్ గురించి తెలుసుకోండి..

వర్షం పడటం సాధారణమే.. కానీ ఆ వర్షపు బొట్ల వెనుక ఒక పెద్ద సైన్స్ దాగుందని మీకు తెలుసా? అసలు సెంటీమీటర్లలో వర్షాన్ని ఎలా లెక్కిస్తారు? 1 mm వర్షం పడితే ఎంత నీరు చేరుతుంది? అసలు ఒక్క గంటలోనే కొండలు విరిగిపడేలా, ఊళ్లను ముంచెత్తే క్లౌడ్‌బర్స్ట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? మిల్లిమీటర్, సెంటిమీటర్ల వర్షం వెనకున్న సీక్రెట్స్ గురించి తెలుసుకోండి..
How Is Rainfall Measured

Updated on: Aug 01, 2026 | 11:46 AM

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆ జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షం పడింది, ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షం నమోదు కానుంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటాం. అయితే అసలు వర్షాన్ని ఎలా కొలుస్తారు? 1 మిల్లీమీటర్ లేదా 1 సెంటీమీటర్ వర్షం అంటే ఎంత నీరు? క్లౌడ్‌బర్స్ట్ అంటే ఏమిటి? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి.
భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని కొలవడానికి ప్రధానంగా మూడు రకాల సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తుంది.

సైమన్స్ రెయిన్ గేజ్: ఇది ఒక సాంప్రదాయ పరికరం. ఒక గరాటు ద్వారా వర్షపు నీరు లోపల ఉండే సీసాలో చేరుతుంది. ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు ఈ నీటిని కొలిచి వర్షపాతాన్ని నమోదు చేస్తారు.

ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు: ఇందులో టిప్పింగ్ బకెట్ రెయిన్ గేజ్‌లను వాడతారు. ప్రతి 0.2 మిల్లీమీటర్ల నీరు నిండగానే, బకెట్ తిరగబడి నీటిని కిందకు వంచేస్తుంది. ఈ ప్రక్రియ డిజిటల్ సిగ్నల్‌గా మారి, డేటా నేరుగా IMD సర్వర్‌కు చేరుతుంది.

డాప్లర్ వెదర్ రాడార్: ఇది ఆధునిక సాంకేతికత. ఆకాశంలో మేఘాల సాంద్రత, విస్తరణ, వర్ష తీవ్రతను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

1 మిల్లీమీటర్ వర్షం అంటే ఎంత?

చాలామందికి 1 మిల్లీమీటర్ లేదా 1 సెంటీమీటర్ వర్షం అంటే ఎంత నీరో ఊహించడం కొంచెం కష్టం. దాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ గురించి చెప్పుకుందాం.. చదునుగా ఉండి, నీరు బయటకు పోకుండా, ఆవిరి కాకుండా, నేలలోకి ఇంకిపోకుండా ఉండే 1 చదరపు మీటరు వైశాల్యం గల స్థలాన్ని ఊహించుకోండి. ఆ స్థలంలో వర్షం వల్ల 1 మిల్లీమీటర్ ఎత్తులో నీరు నిలిస్తే… దాన్నే 1 mm వర్షపాతం అంటారు. అదే స్థలంలో 10 మిల్లీమీటర్ల ఎత్తులో నీరు నిలిస్తే, అది 1 సెంటీమీటర్ వర్షపాతం అవుతుంది.

వర్షపాత తీవ్రతను IMD ఎలా వర్గీకరిస్తుంది?

ప్రతిరోజూ ఉదయం 8:30 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 8:30 గంటల వరకు పడే వర్షపాతం ఆధారంగా వర్ష తీవ్రతను IMD ఈ విధంగా వర్గీకరిస్తుంది.

  • చాలా తేలికపాటి వర్షం: 2.4 mm కంటే తక్కువ
  • తేలికపాటి వర్షం: 2.5 mm నుండి 15.5 mm వరకు
  • మోస్తరు వర్షం: 15.6 mm నుండి 64.4 mm వరకు
  • భారీ వర్షం: 64.5 mm నుండి 115.5 mm వరకు
  • అత్యంత భారీ వర్షం: 115.6 mm నుండి 204.4 mm వరకు
  • తీవ్ర అత్యంత భారీ వర్షం: 204.5 mm లేదా అంతకంటే ఎక్కువ

క్లౌడ్‌బర్స్ట్అంటే ఏమిటి?

చాలామంది చాలా ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్‌బర్స్ట్ అనుకుంటారు. కానీ IMD ప్రకారం… ఒక చిన్న ప్రాంతంలో ఒకే ఒక్క గంటలో 100 మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్‌బర్స్ట్ అంటారు. ఇది క్షణాల్లో కొండచరియలు విరిగిపడటానికి, హఠాత్తుగా విధ్వంసకర ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి కారణమవుతుంది.

వర్షపాతం లెక్కల వల్ల కలిగే ప్రయోజనాలు..

ఈ డేటా కేవలం రోజువారీ వాతావరణ అప్‌డేట్స్ కోసమే కాకుండా అనేక కీలక రంగాలకు సహాయపడుతుంది.

వ్యవసాయం: ఏ పంట వేయాలి, ఎప్పుడు విత్తనాలు నాటాలి, నీటి యాజమాన్యం ఎలా చేయాలో నిర్ణయించుకోవడానికి రైతులకు ఈ సమాచారం ఎంతో అవసరం.

విపత్తు నిర్వహణ: భారీ వర్షాల హెచ్చరికల ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చు.

పట్టణ ప్రణాళిక: నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థలు, వంతెనల నిర్మాణానికి పాత వర్షపాత రికార్డులే ప్రామాణికం.

నీటి యాజమాన్యం: ప్రాజెక్టులకు వచ్చే నీటి ప్రవాహాన్ని అంచనా వేసి, గేట్లు ఎప్పుడు తెరవాలి, నీటిని ఎలా నిల్వ చేయాలో నిర్ణయించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us