Marriage: కల్యాణ ఘడియలపై అమ్మాయిల పాస్ బటన్‌.. బాగా చదువుకుని స్థిరపడ్డాకే మ్యాట్రిమోని వైపు

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిపస్తు... అని ఎవరైనా దీవిస్తే... అది శుద్ధ అబద్ధం కిందే లెక్క. కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని కూడా అంటారు... అది కూడా నిజం కాదు. ఎందుకంటే పెళ్లి ముచ్చటను వాయిదా వేయడం అనేది ప్యాషన్‌గా మారిపోయిందిప్పుడు. అమ్మాయిలైతే వెయిటింగ్‌లోనే ఉంది మజా అంటూ... పెళ్లీడును అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. పెళ్లి ఎంత ఆలస్యమైతే అంత సుఖం... అనేది కొత్త స్లోగన్.

Marriage: కల్యాణ ఘడియలపై అమ్మాయిల పాస్ బటన్‌.. బాగా చదువుకుని స్థిరపడ్డాకే మ్యాట్రిమోని వైపు
Marriage

Updated on: Apr 20, 2023 | 10:25 AM

తాను దూర సందులేదు… మెడకేమో డోలా… అంటూ పెళ్లిని ఒక జంఝాటంగా భావించడం అందరిలోనూ కనిపిస్తోంది. అందుకే… పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.. ఆలస్యమైనా సరే అమృతఘడియల దాకా వెయిట్ చేద్దాం అంటూ కళ్యాణ ఘడియల్ని వాయిదా వేసుకుంటున్నారు… ముఖ్యంగా అమ్మాయిలు. దేశంలో మహిళల సగటు పెళ్లి వయసు 22.7 ఏళ్లు. 2017 నాటికి ఇది 22.1 ఏళ్లుగా ఉండేది. ఐదేళ్లలో ఆరునెలలకు పైగా పెరిగింది అమ్మాయిల సరాసరి పెళ్లీడు. తెలంగాణలో ఐతే 24.3 ఏళ్లు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల మహిళల్లో పెళ్లి పట్ల ఆసక్తి కాస్త తక్కువేనట. కాశ్మీర్ మహిళలైతే 26 ఏళ్లగ్గాని పెళ్లి ధ్యాస కలగడం లేదు.

ఆడపిల్ల కనీస పెళ్లి వయసు ప్రస్తుతం 18 ఏళ్లు. మగాళ్లకైతే 21 ఏళ్లు. అమ్మాయిల పెళ్లి వయసును కూడా 21 ఏళ్లకు పెంచాలన్నది ప్రతిపాదన. కానీ… పెళ్లి విషయంలో చట్టం కంటే మారుతున్న సామాజిక పరిస్థితులే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. బాగా చదువుకుని తమ కాళ్ల మీద తాము నిలబడ్డాకే పెళ్లి చేసుకోవాలన్న మైండ్‌సెట్ అమ్మాయిల్లో కనిపిస్తోంది. పిల్లల్లో గతంలో కంటే చదువుకోవాలన్న కోరిక పెరుగుతోంది. తల్లిదండ్రుల్లో కూడా పెళ్లి విషయంలో వాళ్లకు స్వేచ్ఛనివ్వాలన్న మెచ్యూరిటీ కనిపిస్తోంది.

ఇవాళారేపూ పెళ్లిళ్లు స్టేటస్‌ సింబల్‌గా మారాయి. పెళ్లి ఖర్చులకు సరిపడా డబ్బు మేమే సంపాదించుకుంటాం అనే ఆలోచనతో ఆడపిల్లలు సంపాదన వైపు మొగ్గుచూపుతున్నారు. లేట్ మేరేజ్‌కి ఇది కూడా ఓ కారణం. సగటు పెళ్లి వయసు పెరుగుతోందంటే… పాతికేళ్ల దాకా పెళ్లి ప్రస్తావనే రావడం లేదంటే… అమ్మాయిల ఆలోచనా తీరు అబ్బాయిలతో సమానంగా ఉంటున్నట్టే లెక్క. విద్య, ఉద్యోగ రంగాల్లో స్వావలంబన సాధిస్తున్నట్టే భావించాలి.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..