రానుంది అంతా రోబోల యుగమే అంటే ఏమో అనుకున్నాం. ఇప్పటి వరకు మనకు తెలిసింది సినిమాల్లో చూసిందే. అయితే నిజంగానే రోబోల యుగం రావడం ఖాయంగా అనిపిస్తోంది. మనుషులతో సమానంగా, ఆ మాటకొస్తే మనుషులను మించి రోబోలు ఆధిపత్యాన్ని చెలాయించే రోజులు వచ్చేశాయి. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ రెండింటి కలయికతో సినిమాల్లో చూసిన అద్భుతాలు ఇప్పుడు నిజంగానే నిజం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చేసిన ఓ ఆవిష్కరణ వావ్ అనిపిస్తోంది.
టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకులు ఏకంగా టేబుల్ టెన్నిస్ ఆడగలిగేరోబోను రూపొందించారు. ఈ రోబోట్ 6 DoF ABB 1100 ఆర్మ్‌తో అమర్చారు. ఈ రోబో ప్లేయర్ టేబుల్ టెన్నిస్‌లో మనుషులను మించి పోయిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రోబో ఏకంగా 29 మందిని ఓడించడం విశేషం. ఈ రోబోను పలు రకాల పనుల కోసం రూపొందించారు. ఆలోచనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ఈ రోబో ముఖ్య ఉద్దేశం. ప్రత్యర్థి ఆటకు ఎత్తుగడ వేస్తూ రిప్లై ఇచ్చేలా ఈ రోబోను డిజైన్ చేశారు.
అయితే ఈ రోబోట్ నిర్ణయాలు తీసుకోవడానికి, దానికి ప్రతి స్పందించడానికి సమయం తీసుకుంటోంది. ఈ కారణంగానే కొన్నిసార్లు వేగంగా వచ్చే బాల్స్‌ను హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడుతోంది. అయితే దీనిని కూడా అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత వేగంగా రోబో ప్రతి స్పందించే విధంగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రోబోతో ఆడిన వారిలో చాలా మంది ఓటమిపాలయ్యారు.
Meet our AI-powered robot that’s ready to play table tennis. 🤖🏓
It’s the first agent to achieve amateur human level performance in this sport. Here’s how it works. 🧵 pic.twitter.com/AxwbRQwYiB
— Google DeepMind (@GoogleDeepMind) August 8, 2024
ఇదిలా ఉంటే ఈ రోబో టేబుల్ టెన్నిస్ ఆడిన దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యర్థి ఎత్తుగడలకు వేగంగా స్పందిస్తూ, రోబో షాట్స్ కొడుతుండడం అందరినీ ఆశ్చచర్యానికి గురి చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇలాగే ప్రయోగాలు కొనసాగితే మరెన్నో అద్భుతాలు జరగడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియో చూసిన కొందరు.. ఈ ఆవిష్కరణలు కొనసాగితే రాబోయే ఒలింపిక్స్‌లో మనుషులతో పాటు, రోబోలు పోటీ పడాల్సి వస్తాయేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..