తమిళనాడు ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్, తిరువళ్లువర్ విగ్రహం మధ్య చేపట్టిన గాజు వంతెన పూర్తయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గాజు వంతెనను డిసెంబర్ 30న తమిళనాడు సీఎం స్టాలిన్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. అలాగే సోమవారం నుంచే ఈ గ్లాస్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణలో చెన్నైకి చెందిన VME ప్రీకాస్ట్ ప్రొడక్ట్స్ కంపెనీ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. రెండు వైపులను కనెక్ట్ చేసేలా.. పైకప్పును ఉక్కుతో రూపొందించారు. అలాగే ఈ వంతెనను స్టీల్ ప్లాట్‌ఫారమ్‌పై రెండున్నర మీటర్ల గాజు పలకలతో నిర్మించారు. కన్యాకుమారి త్రివేణి సంగమంలోని తిరువళ్లువర్ విగ్రహం రజతోత్సవ వేడుకలు డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.
నిర్మాణ వ్యయం – 37 కోట్లు
పొడవు – 77 మీటర్లు
వెడల్పు – 10 మీటర్లు
మరోవైపు జనవరి 1, 2000వ సంవత్సరంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించారు అప్పటి సీఎం కరుణానిధి. ఈ పీఠం 133 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. 2004లో వచ్చిన సునామీని సైతం ఈ విగ్రహం తట్టుకుంది. ఆ సమయంలో ఈ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగలేదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి