AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్ట్!

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం దాడి ఘటన కొత్త మలుపు తిరిగింది. విమానాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందనే అనుమానాల మధ్య మరో ఇద్దరు పైలట్లను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసారు. సెప్టెంబర్ 30న విమానంలో దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓమన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మమితో కలిసి వీరు పనిచేసారు.

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్ట్!
Uae Arrests 2 Maldivian Pilots Over Links With Omani Suspect
Sharada V
|

Updated on: Oct 14, 2026 | 11:25 PM

Share

గత సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమాన కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కో-పైలట్ హమామ్ అల్-హమ్మమి గొడ్డలితో దాడి చేసాడు. ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత దర్యాప్తు కొనసాగుతుండగా, మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లను కూడా దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మాల్దీవుల వార్తా సంస్థ ‘అధాదు’ తెలిపింది. గత శనివారం వారిని అరెస్ట్ చేసారు. యూఏఈలోని మాల్దీవుల రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియచేసింది. అరెస్టయిన ఇద్దరు పైలట్లు గతంలో ఇజ్రాయెల్‌కు వెళ్లారు.

కో-పైలట్‌తో కలిసి పనిచేసిన పైలట్లు?

ఫ్లైదుబాయ్‌లో పనిచేస్తున్న ఆరుగురు మాల్దీవుల పౌరుల్లో ఇద్దరు అరెస్టయిన  వారిలో ఉన్నారు. సెప్టెంబర్ 30న విమానంలో దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓమన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మమితో కలిసి వీరు పనిచేసారు. ఈ అరెస్టులపై మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అరెస్టయిన పైలట్లపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు.

కాక్‌పిట్‌లో ఏం జరిగింది?

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన FZ1073 విమానంలో 174 మంది ఉన్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఓమన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మమి, భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై గొడ్డలితో దాడి చేసాడు. బోయింగ్ 737 విమానాలను నడపడంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న కెప్టెన్ స్మిత్ తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యంగా ప్రతిఘటించారు. రక్తస్రావం అవుతున్నా కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ఇద్దరు స్టాండ్‌ బై పైలట్లు లోపలికి వెళ్లి విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా దించారు. ఈ ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో కెప్టెన్ స్మిత్ కీలక పాత్ర పోషించారు.

స్మిత్‌ను ప్రశంసించిన మోదీ, నెతన్యాహు

విమానంలోని ప్రయాణికులను కాపాడేందుకు కెప్టెన్ స్మిత్ చూపిన ధైర్యంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ‘రియల్ హీరో’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా నిజమైన కథానాయకుడిగా కొనియాడారు. గాయపడిన స్మిత్ యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

విమానాన్ని కూల్చడమే లక్ష్యమా?

విమానాన్ని ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో కూల్చివేయడమే నిందితుడి లక్ష్యమని తెలిసి ప్రపంచం ఉలిక్కిపడింది. విమానంలో పురుష ఫ్లైట్ అటెండెంట్లనే నియమించారనే అంశాన్ని ఓ ప్రయాణికుడు లేవనెత్తినట్లు కొన్ని పత్రికలు కథనాలు రాసాయి. సిబ్బందిలో మరికొందరి సహాయం నిందితుడికి అందిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.  ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఇద్దరు పైలట్ల అరెస్ట్ కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటన వెనుక కుట్ర ఏంటనేది అధికారుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తే కానీ తెలియదు.

Follow Us