AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఇగో డేటా వర్క్‌తో నయా ట్రెండ్..!

Ego Centric Data Collection Jobs: సాంకేతిక విప్లవం సృష్టిస్తున్న సరికొత్త అద్భుతాలలో ఈ ‘ఇగో డేటా వర్క్’ నిజంగా సామాన్యులకు ఒక వరం లాంటిదే. శ్రమను నమ్ముకుని జీవించే వారికి తమ దైనందిన పనుల ద్వారానే అదనపు ఆదాయం లభించడం విశేషం. మరెందుకు ఆలస్యం, టెక్నాలజీని అందిపుచ్చుకుని రోబోలకు పాఠాలు నేర్పుతూ మీరూ లక్షల్లో సంపాదించండి!

ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఇగో డేటా వర్క్‌తో నయా ట్రెండ్..!
Ego Centric Data Collection Jobs
Venkata Chari
|

Updated on: Jun 07, 2026 | 1:01 PM

Share

Ego Data Work: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇల్లాళ్లు, కార్మికులు ఎన్నో పనులు చేస్తుంటారు. కాఫీ కలపడం, గిన్నెలు కడగడం, బట్టలు మడతపెట్టడం.. ఇలాంటి రోజువారీ పనులకు ఎవరైనా డబ్బులిస్తారా? కానీ, ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని మీ సొంత పనులు మీరు చేసుకుంటూనే నెలకు వేలల్లో, లక్షల్లో సంపాదించవచ్చు. ఈ సరికొత్త ఉపాధి మార్గమే ‘ఇగో డేటా వర్క్’.

నెట్టింట వైరల్ అవుతున్న నయా ట్రెండ్..

ఇటీవల సామాజిక మాధ్యమాలలో ఒక ఆసక్తికరమైన వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బెంగళూరు కూరగాయల మార్కెట్‌లో ఆకుకూరలు అమ్ముకునే ఒక సాదాసీదా కుర్రాడు, తన తలకి ఒక పట్టీ సాయంతో సెల్‌ఫోన్‌ను కట్టుకుని పని చేసుకుంటున్నాడు. అతడు ఆకుకూరలు కట్టలు కడుతున్న దృశ్యాలను ఆ ఫోన్ ద్వారా రికార్డ్ చేస్తున్నాడు. ఇలా కేవలం రోజుకు కొన్ని గంటల పాటు వీడియో తీస్తూ, గంటకు రూ.350 చొప్పున నెలకు ఏకంగా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడని తెలిసి ఐటీ ఉద్యోగులు సైతం నోరెళ్లబెడుతున్నారు.

కేవలం ఆ కుర్రాడే కాదు.. మదనపల్లెలో వెదురుబుట్టలు అల్లే మహిళలు, అహ్మదాబాద్, దిల్లీ, తమిళనాడు వంటి నగరాల్లోని వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. కళ్లకు స్మార్ట్ అద్దాలు లేదా తలకు కెమెరాలు తగిలించుకుని తాము చేసే రోజువారీ పనులను రికార్డ్ చేస్తూ నెలకు అదనంగా రూ.20 వేల వరకు ఆర్జిస్తున్నారు.

ఏమిటీ ‘ఇగో సెంట్రిక్ డేటా కలెక్షన్’?

మనం మన కళ్లతో ప్రపంచాన్ని ఎలా చూస్తామో, అలాగే రికార్డ్ చేయడాన్ని టెక్నాలజీ భాషలో ‘ఫస్ట్‌పర్సన్ డేటా’ లేదా ‘ఇగో డేటా’ అంటారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలలో లక్షలాది మంది దీనిని ఒక అద్భుతమైన ఉపాధిగా మార్చుకుంటున్నారు. అసలు ఈ వీడియోలను ఎవరు కొంటారు? వీటి వల్ల వారికి వచ్చే లాభం ఏంటనే కదా మీ సందేహం!

రోబోలకు పాఠాలు నేర్పే గురువులు.. మనమే!

భవిష్యత్తు అంతా కృత్రిమ మేధస్సు (ఏఐ), అచ్చం మనుషుల్లా ప్రవర్తించే ‘హ్యుమనాయిడ్ రోబో’లదేనని మనకు తెలుసు. అయితే, ఈ రోబోలకు మనుషుల సహజ సిద్ధమైన కదలికలను నేర్పించడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారింది. ఒక వస్తువును మనుషులు ఎలా చూస్తారు, ఎలా పట్టుకుంటారు అనేది రోబోలకు తెలియాలి.

ఉదాహరణకు, మనం కూరగాయలు కోసేటప్పుడు కత్తిని ఒక ప్రత్యేకమైన ఒడుపుతో పట్టుకుంటాం. చేతిలో నుంచి జారిపోయే సబ్బును పట్టుకోవడానికి వేళ్లను ఎంత మేర బిగించాలో మనకు తెలుసు. బరువైన పాత్రలు ఎత్తేటప్పుడు, వస్త్రాలను మడతపెట్టేటప్పుడు మన చేతుల కదలికలు వేర్వేరుగా ఉంటాయి. ఈ సున్నితమైన మానవ కదలికలను, స్పర్శను రోబోలకు నేర్పేందుకే మెటా, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఈ ఇగో డేటాను కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయి.

మార్కెట్ వీధిలో జనాలను తప్పించుకుంటూ నడవడం, వంట వండటం, డ్రైవింగ్ చేయడం, సూపర్ మార్కెట్‌లో సరుకులు బుట్టలో వేసుకోవడం.. ఇలా మనం చేసే ప్రతి చిన్న పని ఈ రోజుల్లో రోబోలకు పాఠ్య్యాంశాలుగా మారి, మనకు సరికొత్త ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.

ఉపాధి కల్పిస్తున్న అగ్రగామి సంస్థలు..

ప్రస్తుతం ఈ రంగంలో అనేక స్టార్టప్ కంపెనీలు పెట్టుబడులతో దూసుకుపోతున్నాయి. ‘హ్యుమన్.ఏఐ’ అనే సంస్థ సుమారు రూ.200 కోట్ల నిధుల సహాయంతో పది దేశాల నుంచి ఈ డేటాను సేకరిస్తోంది. మనదేశంలో కూడా ఆబ్జెక్ట్‌వేస్, ఎఫ్‌పీవీ ల్యాబ్స్, నియోక్యాంబ్రియన్ వంటి సంస్థలు ఈ తరహా ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఆఫర్ చేస్తున్నాయి. ఈ సంస్థలను సంప్రదించి, మన వివరాలను పంపించి, ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం రోజూవారి పనులు చేస్తూనే డబ్బులు సంపాదించొచ్చు.

కొన్ని సంస్థలు నేరుగా ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌ల కార్మికులకు స్మార్ట్‌గ్లాసులు అందించి ఈ పనులు చేయిస్తుండగా, మరికొన్ని సంస్థలు సామాన్యులకు ఇంటి నుంచే ఫ్రీలాన్స్ పద్ధతిలో పనిచేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ప్రముఖ ఉద్యోగ సమాచార వేదికలైన లింక్డిన్, నౌకరీ, ఇండీడ్ వంటి వెబ్‌సైట్లలో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us