Video: నేపాల్ వరదల్లో చిక్కుకున్న కుక్క.. ప్రాణాలకు తెగించి రెస్క్యూ
చుట్టూ ప్రమాదం.. ఒకవైపు ఎత్తైన కొండ.. మరోవైపు భారీగా ప్రవహిస్తున్న గండకి నది. నేపాల్ వరదల్లో ఓ కుక్క కొండచరియకు, ఉధృతంగా ప్రవహిస్తున్న నదికి మధ్య చిక్కుకుపోయింది. ఇద్దరు కయాకింగ్ నిపుణులు సాహసోపేతంగా నదిని దాటి ఆ కుక్కను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 20 రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన సేటి సురక్షితంగా బయటపడింది.

నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. థాడో భార్యాంగ్ గ్రామానికి చెందిన దయారామ్ కార్కీ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్క పేరు సేటి. అక్టోబర్ 11న బుధి గండకి నదీ పరివాహక ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఆ వరదల్లో సేటి కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ నదిలో కొట్టుకుపోకుండా నేలపైకి చేరుకుంది. ఎత్తైన కొండచరియకు, ఉధృతంగా ప్రవహిస్తున్న బుధి గండకి నదికి మధ్య ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయింది. చుట్టూ నీరు, వెనక కొండ కావడంతో అక్కడి నుంచి బయటపడే మార్గం లేకుండా పోయింది. గత బుధవారం స్థానికులు సేటిని గుర్తించారు. అప్పటి నుంచి దానికి ఆహారం అందించేందుకు ప్రయత్నించారు. నదికి అవతలి వైపు నుంచి బిస్కెట్లు విసిరి దాని ఆకలి తీర్చారు.
హెలికాప్టర్ ద్వారా రక్షించే ప్రయత్నం
సేటిని కాపాడేందుకు స్థానికులు, అధికారులు ప్రయత్నించారు. యానిమల్ నేపాల్, గోర్ఖా జేసీస్ సంస్థలు ఈ ప్రయత్నాల్లో భాగమయ్యాయి. మొదట హెలికాప్టర్ ద్వారా బయటకు తీసుకురావాలని భావించారు. అయితే వాతావరణం అనుకూలించక విమాన ప్రయాణానికి అనుమతులు లభించలేదు. దీంతో ఆ ప్రయత్నం విఫలమైంది.
ప్రాణాలకు తెగించి నదిని దాటిన ఇద్దరు
చివరకు ధాడింగ్‌లోని రాయల్ బీచ్ క్యాంప్ సహకారం తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రొఫెషనల్ కయాకింగ్, రాఫ్టింగ్ నిపుణుల బృందం జగత్ బగర్‌కు చేరుకుంది. వర్షం కురుస్తున్నా, నది ఉధృతంగా ప్రవహిస్తున్నా ఇద్దరు నిపుణులు వెనక్కి తగ్గలేదు. రామ్ సిల్వాల్, అరుణ్ థాపాలియా.. కయాక్‌ల సాయంతో ప్రమాదకరమైన నదిని దాటి సేటి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత కుక్కను జాగ్రత్తగా కయాక్‌లోకి ఎక్కించి, నది అవతలి ఒడ్డుకు తీసుకొచ్చారు. 20 రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన సేటి ఎట్టకేలకు సురక్షితంగా బయటపడింది.
కుక్క మెడలో సంప్రదాయ కండువా
గ్రామీణ మున్సిపాలిటీ అధ్యక్షుడు నిమా లామా, రక్షక బృందానికి సంప్రదాయ కండువాలు (ఖడాస్) వేసి స్వాగతం పలికారు. అదే కండువాను సేటి మెడలో కూడా వేశారు. ఉధృతమైన నదిలోకి వెళ్లి కుక్కను కాపాడిన ఇద్దరు కయాకింగ్ నిపుణులకు నిమా లామా కృతజ్ఞతలు తెలిపారు. వర్షం పడుతున్నా, నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా వారు ఎంతో ధైర్యంగా సేటిని రక్షించారని ప్రశంసించారు. 20 రోజుల పాటు ఒంటరిగా చిక్కుకుపోయిన సేటి కథ.. జంతువుల పట్ల ప్రేమ, వాటిని కాపాడేందుకు మనుషులు చూపిన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.