Viral Video: ఛాతీలో మంటతో ఆసుపత్రికి మహిళ .. ఎండోస్కోపీ చూసి వైద్యులు షాక్!
ఛాతీలో మంట, ఎసిడిటీ సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు ఎండోస్కోపీ చేయగా.. పొట్టలో జీవించి ఉన్న 35 సెంటీమీటర్ల పొడవైన రౌండ్వార్మ్ను గుర్తించి వైద్యులు బయటకు తీసారు. సాధారణంగా పేగుల్లో నివసించే ఈ పరాన్నజీవి.. అరుదైన పరిస్థితుల్లో సైజు పెరిగి జీర్ణవ్యవస్థలోని ఇతర భాగాలకు చేరి ఇన్ఫెక్షన్కు దారి తీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం, ఈ ఇన్ఫెక్షన్తో ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు.

ఛాతీలో మంటతో ఆసుపత్రికి వెళ్లిన మహిళకు వైద్యులు ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించిన వైద్యులు ఆమె ఆహార నాళంలో 35 సెంటీమీటర్ల పొడవున్న రౌండ్వార్మ్ను గుర్తించి బయటకు తీసారు. అస్కారిస్ లుంబ్రికాయిడ్స్ (Ascaris lumbricoides) అనే పరాన్నజీవి సాధారణంగా మనుషుల చిన్నపేగుల్లో నివసిస్తుంది. ఈ పురుగు పేగుల్లో సైజు పెరిగిన ఇన్ఫెక్షన్కు దారి తీయడాన్ని అస్కారియాసిస్ (Ascariasis) అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పేగు పరాన్నజీవుల ఇన్ఫెక్షన్లతో దాదాపు 150 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు.
మనిషి శరీరంలోకి ఈ పురుగులు ఎలా చేరుతాయి?
ఈ ఇన్ఫెక్షన్ ప్రధానంగా పరాన్నజీవి గుడ్లను నోటి ద్వారా మింగడం వల్ల వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు లేదా శుభ్రం చేసుకోని చేతుల ద్వారా వీటి గుడ్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. శరీరంలోకి చేరిన గుడ్ల నుంచి లార్వాలు బయటకు వస్తాయి. ఇవి పేగు గోడలను దాటి ప్రయాణిస్తాయి. లార్వాలు రక్తప్రసరణ ద్వారా ఊపిరితిత్తులకు చేరి, అక్కడి నుంచి శ్వాసనాళాల మీదుగా గొంతు వైపుకి వస్తాయి. ఆ తర్వాత మళ్లీ మింగినప్పుడు చిన్నపేగుల్లోకి చేరుతాయి. చిన్నపేగుల్లో ఇవి పూర్తిస్థాయి పురుగులుగా ఎదిగి, గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. పురుగుల గుడ్లు మలంతో బయటకు వస్తాయి. పారిశుద్ధ్య లోపం కారణంగా నేల కలుషితమైతే, ఈ గుడ్లు అనుకూల పరిస్థితుల్లో అభివృద్ధి చెంది మరొకరికి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. అందుకే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం.
A woman had symptoms of acidity and heartburn. Doctors gave her general anesthesia and started to look for the cause by doing an endoscopy. A long parasite was removed from her esophagus.
Ascaris lumbricoides is a roundworm that can grow up to 35 cm long. People get it by swallowing tiny eggs from dirty soil or food. The eggs hatch in the intestine. Young worms then travel through the blood to the lungs.
From the lungs the worms are coughed up into the throat. They are then swallowed again and go down into the stomach. They finally settle and grow into adults in the small intestine.
Adult worms normally stay in the intestine. Sometimes they move upward into the stomach or esophagus. This can cause burning pain and the need for removal. https://t.co/S3gdIKD7LN
— Dr. AK 🇮🇳 (@docakx) October 12, 2026
అస్కారియాసిస్ లక్షణాలు ఏమిటి?
ఈ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతి ఒక్కరికీ స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. పురుగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అవి శరీరంలోని ఇతర భాగాలకు చేరినప్పుడు లక్షణాలు బయటపడతాయి. కడుపునొప్పి, వికారం, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, లార్వాలు ఊపిరితిత్తుల ద్వారా ప్రయాణించే సమయంలో దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు, ఆకలి తగ్గడం, పోషకాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం సాధారణంగా కనిపించే లక్షణాలు.
ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే?
అస్కారియాసిస్ వంటి పరాన్నజీవుల ఇన్ఫెక్షన్లను నివారించడంలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుంది. భోజనానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడిగి ఉపయోగించాలి. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తీసుకోవాలి. ఆహార పదార్థాలను శుభ్రంగా, సురక్షితంగా నిల్వ చేయాలి. పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని పాటించాలి. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలి.