AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes: పాముల గురించి మనం నమ్మే పచ్చి అబద్ధాలు ఇవే.. అసలు నిజాలు ఏంటంటే..?

పాము పగ పడుతుంది, బూర ఊదితే నాట్యం చేస్తుంది, పాలు పోస్తే తాగుతుంది అంటూ మన పెద్దలు ఎన్నో చెప్తుంటారు. పాములకు పాలు పోస్తే నిజంగానే తాగుతాయా? వాటికి పగ తీర్చుకునే శక్తి ఉంటుందా? తరతరాలుగా సమాజంలో పాముల గురించి కొనసాగుతున్న ప్రచారాల వెనుక ఉన్నది సైన్సా లేక మూఢనమ్మకాలా? అనే ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Snakes: పాముల గురించి మనం నమ్మే పచ్చి అబద్ధాలు ఇవే.. అసలు నిజాలు ఏంటంటే..?
Snake Myths And Facts
Krishna S
|

Updated on: Oct 24, 2026 | 7:46 PM

Share

భూమిపై అత్యంత రహస్యమైన, ఆసక్తికరమైన జీవుల్లో పాములు ముందు వరుసలో ఉంటాయి. ప్రాచీన కాలం నుంచి పాముల చుట్టూ అల్లుకున్న కల్పిత కథలు, సినిమాల్లో చూపించే నాగిని సీన్లు ప్రజల్లో ఎన్నో మూఢనమ్మకాలను నాటాయి. బూర ఊదితే నాట్యం చేస్తాయని, పాలు తాగుతాయని, కొడితే పగ పడతాయని తరతరాలుగా నమ్ముతున్నాం. అయితే నేటి ఆధునిక జీవశాస్త్రం పాముల శరీర నిర్మాణం, వాటి వేట సామర్థ్యాల వెనుక ఉన్న అసలు రహస్యాలను బట్టబయలు చేసింది. పాములకు గాలి పీల్చుకోవడానికి ముక్కు రంధ్రాలు ఉన్నప్పటికీ, అవి వాసన చూడటానికి ముక్కును వాడవు. పాము తన రెండు చీలికల నాలుకను బయటకు తీసినప్పుడు, గాలిలో, నేలపై ఉండే రసాయన అణువులను నాలుక కొనలు ఒడిసిపట్టుకుంటాయి. ఆ తర్వాత నాలుకను లోపలికి లాగి నోటి పైభాగంలో ఉండే జాకబ్సన్ ఆర్గాన్ అనే ప్రత్యేక భాగాన్ని తాకిస్తాయి. ఈ అవయవం ఆ రసాయన కణాలను విశ్లేషించి మెదడుకు సంకేతాలు పంపుతుంది. దీనివల్ల ఆహారం ఎక్కడుంది, శత్రువులు ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నారనేది పాము అత్యంత కచ్చితత్వంతో పసిగడుతుంది.

చెవులు లేకుండా శబ్దాలను ఎలా వింటాయి?

పాములకు బయటకు కనిపించే బాహ్య చెవులు గానీ, శబ్ద తరంగాలను స్వీకరించే కర్ణభేరి గానీ ఉండవు. ఇవి గాల్లో వచ్చే శబ్దాలను వినలేవు కానీ నేల నుంచి వచ్చే సూక్ష్మమైన ప్రకంపనలకు అత్యంత సున్నితంగా స్పందిస్తాయి. పాము నేలపై పాకుతున్నప్పుడు దాని కింది దవడ ఎముకలు నేలను తాకుతాయి. సమీపంలో ఏదైనా జీవి అడుగులు వేసినప్పుడు వచ్చే కంపనాలు దవడ ఎముకల ద్వారా లోపలి చెవికి చేరుతాయి. పాములు పట్టేవాడు బూర ఊదినప్పుడు పాము ఆ సంగీతానికి స్పందించదు. ఆ వ్యక్తి చేతుల కదలికలు, వాయిద్యం కదులుతున్న తీరును చూసి, తనను తాను రక్షించుకోవాలనే రక్షణాత్మక చర్యగా పడగ విప్పి అటూ ఇటూ కదులుతుంది తప్ప పాముకు సంగీతం వినపడదు.

చిమ్మచీకటిలోనూ వేటాడే థర్మల్ విజన్

రాటిల్ స్నేక్స్, వైపర్స్, కొండచిలువలు వంటి కొన్ని జాతుల పాములకు ముక్కు, కళ్ల మధ్య పిట్ ఆర్గాన్స్ అనే ప్రత్యేక రంధ్రాలు ఉంటాయి. ఇవి పరారుణ కిరణాలను గుర్తించే ఉష్ణ సంవేదకాలుగా పనిచేస్తాయి. చిమ్మచీకటిలో కూడా ఎలుకలు, పక్షుల శరీరాల నుంచి వచ్చే వేడిని ఈ అవయవాలు పసిగడతాయి. పాము మెదడులో ఆ వేడి ఒక స్పష్టమైన థర్మల్ ఇమేజ్‌గా మారి, చీకట్లోనూ గురి తప్పకుండా వేటాడటానికి సహాయపడుతుంది. పాములకు రెప్పలు ఆర్పే కనురెప్పలు ఉండవు. వాటి కళ్లపై దుమ్ము పడకుండా బ్రిల్ అనే పారదర్శక రక్షణ పొర ఉంటుంది. పాము కుబుసం విడిచిన ప్రతిసారీ ఈ పారదర్శక కంటి పొర కూడా కొత్తగా మారుతుంది.

పాలు తాగుతాయా? తాగితే చచ్చిపోతాయా?

పాములు పాలు తాగుతాయన్నది పూర్తిగా అశాస్త్రీయమైన నమ్మకం. పాములు మాంసాహారులు. వాటి జీర్ణవ్యవస్థలో పాలలోని లాక్టోజ్‌ను జీర్ణం చేసుకునే ఎంజైమ్‌లు అస్సలు ఉండవు. నాగులచవితి వంటి పండుగలప్పుడు రోజులు, వారాల తరబడి దాహంతో అల్లాడేలా చేసి వాటి ముందు పాలు పెడితే, కేవలం ద్రవపదార్థం అనే భ్రమతో తాగుతాయి. అలా పాలు తాగించడం వల్ల అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం, వాంతులు, తీవ్రమైన డీహైడ్రేషన్ బారినపడి పాములు కొన్ని రోజుల్లోనే చనిపోతాయి.

పాములు పగ పడతాయా?

సినిమాల్లో చూపించినట్లుగా పాములు మనుషులను గుర్తుపెట్టుకుని పగ తీర్చుకోవడం అనేది పచ్చి అబద్ధం. భావోద్వేగాలు, గత జ్ఞాపకాలు, ప్రతీకార ఆలోచనలను నిల్వ ఉంచేందుకు అవసరమైన మెదడు భాగం పాముల్లో అభివృద్ధి చెందలేదు. కాబట్టి పాముకు పగ, ప్రతీకారం వంటి భావనలు ఉండవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

నెలల తరబడి ఆహారం లేకుండా ఎలా ఉంటాయి?

పాములు శీతల రక్త జీవులు. అవి తమ శరీర ఉష్ణోగ్రతను సొంతంగా నియంత్రించుకోలేవు కాబట్టి వాటి జీవక్రియ రేటు చాలా నెమ్మదిగా సాగుతుంది. ఒక్కసారి కడుపు నిండా వేటాడి తింటే, ఆ శక్తిని వృథా చేయకుండా నెలల తరబడి ఏమీ తినకుండా జీవించే అద్భుత సామర్థ్యం వీటికి ఉంటుంది.

రైతుల నిజమైన మిత్రులు

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర వెలకట్టలేనిది. పంటలను సర్వనాశనం చేసే ఎలుకలు, ప్రమాదకర కీటకాలను వేటాడి వాటి జనాభాను సహజంగా అదుపులో ఉంచుతాయి. తద్వారా రైతులకు వేల కోట్ల రూపాయల పంట నష్టాన్ని తప్పిస్తాయి. మూఢనమ్మకాలతో పాములను చంపడం ఆపి, పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడం మనందరి బాధ్యత.

Follow Us