ఈ రోజుల్లో యువత రీళ్లు తయారు చేయడం, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం వంటి వాటికి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. కొందరు వింత చేష్టలతో ప్రజల్ని బిత్తరపోయేలా చేస్తుంటే, మరికొందరు ప్రాణాలను సైతం పణంగా పెట్టి రిస్క్‌లు చేస్తుంటారు. అలాంటి వారిపట్ల పోలీసులు సైతం కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ రీల్స్ పేరుతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ.. విన్యాసాలు చేసే వారి వీడియోలు ఆగటం లేదు. రోజుకో కొత్త రూపాల్లో రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి మరో వీడియో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతం నుండి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ వీధుల్లో ఓ యువ జంట స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ డ్రెస్‌లు ధరించి బైక్‌పై షికారుకు బయల్దేరింది. ఈ విషయం గమనించిన పోలీసులు వారికి తగిన గుణపాఠం నేర్పించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
వీడియో వైరల్ అవుతుండగా, మొదట్లో స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న ఓ యువకుడు రోడ్డుపై బైక్ నడుపుతూ, మార్గ మధ్యలో నడిరోడ్డుపై బండి ఆపేసి వీడియోకు ఫోజులిచ్చాడు. ఆ తర్వాత మరికాస్త ముందుకు వెళ్లగా ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోంచి స్పైడర్ గర్ల్ దుస్తుల్లో ఉన్న అతని స్నేహితురాలు కూడా అతనితో చేరింది. బైక్‌పై వారిద్దరూ హాలీవుడ్ సినిమా క్యారెక్టర్ల రేంజ్‌లో వీడియోను తయారు చేస్తున్నారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ గాలిలో చేతులు పైకెత్తి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సమయంలో, అతను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, విచిత్ర విన్యాసాలు చేస్తూ వారి ప్రాణాలను కూడా పట్టించుకోలేదు. ఈ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చి కారణంగానే వీరిద్దరూ ఇదంతా చేశారు. ఈ వీడియో నజాఫ్‌గఢ్‌లోని రహదారిపై జరిగినట్టుగా తెలిసింది. ఇక్కడ ధనవంతులు ఎలాంటి భయం లేకుండా ఇలాంటి స్టంట్ వీడియోలు చేస్తున్నారని పలువురు విమర్శించారు.
నజాఫ్‌గడ్‌కు చెందిన ఆదిత్య వర్మతో పాటు ఓ యువతి కలిసి స్పైడర్ మ్యాన్ నజాఫ్ గఢ్ పార్ట్-5 పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్‌గా మారింది. డ్రెస్సింగ్ విధానంలో కూడా కొత్తగా ఉండాలని స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్‌లా డ్రెస్ వేసుకొని బైక్‌పై ఢిల్లీ వీధుల్లో షికారు కొట్టారు. సెల్ఫీలు, వీడియోలు తీస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. చివరకు ఢిల్లీలోని ద్వారాక ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరటంతో ఈ జంటను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంవీఐ యాక్ట్ కింద జరిమానా విధించి వదిలేశారు. నంబర్ ప్లేట్‌లేని బైక్ నడపడంతో పాటు హెల్మెట్ ధరించకపోవడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చలాన్లు జారీ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..