
ఢిల్లీ మెట్రోలో అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. తన అనుమతి లేకుండా ఫొటోలు తీశాడని ఓ మహిళ ఆరోపించడంతో.. మెట్రో కోచ్‌లో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారి, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై CISF శాఖాపరమైన విచారణకు ఆదేశించడంతో పాటు సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.
ఆదివారం తెల్లవారుజామున సుమారు 12.40 గంటల సమయంలో ఎయిమ్స్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. మెట్రో కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. తన ఫొటోలు CISF అధికారి తీస్తున్నారని ఆరోపించింది. దీంతో ఆమె సదరు సిబ్బందిని ప్రశ్నించింది. అయితే తాను ఆమె ఫొటోలు తీయలేదని సిబ్బంది ఖండించినట్లు తెలుస్తోంది. వాగ్వాదం జరుగుతున్న సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్‌ను ప్రయాణికులు పరిశీలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఫోన్ గ్యాలరీలో మహిళకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయని కొందరు ప్రయాణికులు ఆరోపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ ఫొటోలను తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వైరల్ వీడియోలో కొందరు ప్రయాణికులు ఫొటోలు డిలీట్ చేయాలని CISF సిబ్బందిని పదేపదే కోరుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి.. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి ఏర్పడింది.
ఘర్షణ సమయంలో CISF అధికారి తన సర్వీస్ పిస్టల్‌ను బయటకు తీసి ప్రయాణికుల వైపు గురిపెట్టారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. ఈ ఆరోపణ ఘటనను మరింత తీవ్రంగా మార్చింది. అయితే మెట్రో పోలీసు వర్గాలు మాత్రం ఆయుధంతో కూడిన అలాంటి ఘటన ఏదీ జరగలేదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అసలు ఏం జరిగిందన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఘటనపై CISF అధికారులు చర్యలు ప్రారంభించారు. సంబంధిత అధికారిని సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు CISF వర్గాలు తెలిపాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు, PCR కాల్ అందడంతో మెట్రో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఫొటోలు తీసినట్లు ఆరోపించిన మహిళ నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.