Viral Video: హాస్టల్ మెస్‌లో అనుకోని అతిథి.. తినడానికి వెళ్లిన స్టూడెంట్స్ పరుగో పరుగు.. వీడియో వైరల్..
విద్యార్థులంతా భోజనం చేయడానికి మెస్‌కు వెళ్లారు. అప్పుడే అక్కడికి అనుకోని అతిథి వచ్చింది. దాన్ని చూసిన మెస్ సిబ్బంది, విద్యార్థులు భయాందోళనతో పరుగులు తీశారు. చివరకు అటవీశాఖ అధికారులు ఎంట్రీ ఇచ్చి వచ్చిన అతిథిని సురక్షితంగా రెస్క్యూ చేశారు. అసలు విద్యార్థులను అంతలా భయపెట్టేలా మెస్‌లోకి ఏమొచ్చింది అనేది తెలుసుకుందాం..

రాజస్థాన్‌లోని ప్రముఖ కోచింగ్ హబ్ కోటాలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా విద్యార్థుల అరుపులు, సందడితో ఉండే ఓ బాయ్స్ హాస్టల్ మెస్ ఒక్కసారిగా కలకలానికి వేదికైంది. కారణం విద్యార్థులు తినే మెస్‌లో ఓ మొసలి ప్రత్యక్షమవడం. కోరల్ పార్క్‌లోని ఓ బాయ్స్ హాస్టల్‌లో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హాస్టల్ మెస్‌లోని సీసీటీవీ కెమెరాలో దీనికి సంబంధించిన వీడియో రికార్డు అయ్యింది. మెట్లపై నుంచి నెమ్మదిగా బేస్‌మెంట్ డైనింగ్ ఏరియాలోకి మొసలి నడుచుకుంటూ వచ్చింది. దానిని చూసిన వెంటనే వంట మనుషులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురై కిచెన్ వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ వార్త క్షణాల్లో హాస్టల్ అంతటా వ్యాపించడంతో అక్కడ ఉంటున్న కోచింగ్ విద్యార్థులు కూడా ప్రాణాలు చేతుల్లో పట్టుకుని బయటకు పరుగులు తీశారు.
విద్యార్థుల సాహసం.. ఆపై అటవీ శాఖ రెస్క్యూ
అటవీ శాఖ అధికారులు వచ్చేలోపే కొందరు విద్యార్థులు సొంతంగా ఆ మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే విద్యార్థుల అరుపులు, గందరగోళంతో మరింత భయపడిన ఆ మొసలి మెస్‌లో అటు ఇటూ వేగంగా తిరగడంతో అక్కడ వాతావరణం మరింత ఆందోళనకరంగా మారింది. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ యాజమాన్యం అటవీ శాఖకు సమాచారం అందించింది. రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, చాకచక్యంగా ఆ మొసలిని బంధించింది.
రెస్క్యూ చేశాం..
‘‘మొసలిని సురక్షితంగా రెస్క్యూ చేశాం. ఆ తర్వాత దాని సహజ సిద్ధమైన ఆవాసమైన చంబల్ నదిలో సురక్షితంగా విడిచిపెట్టాం. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు’’ అని ఫారెస్ట్ ఆఫీసర్ వీరేంద్ర సిగ్ తెలిపారు. సమయానికి అధికారులు స్పందించి మొసలిని పట్టుకోవడంతో విద్యార్థులు, హాస్టల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
