AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్ గ్రూపుల్లోకి పాక్ గూఢచారులు.. భద్రతా సంస్థల హై అలర్ట్

WhatsApp Group Infiltration: వాట్సాప్‌లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఎలాంటి ఫొటోలు, డాక్యుమెంట్లు షేర్ చేస్తున్నాం? గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారు? సాధారణంగా ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోం. కానీ మనకు తెలియకుండానే ఓ గుర్తుతెలియని వ్యక్తి గ్రూపులో చేరి.. మన ప్రతి మాటను గమనిస్తుంటే? పైగా ఆ వ్యక్తి శత్రుదేశానికి చెందిన గూఢచారి అయితే? ఇప్పుడు ఇలాంటి అనుమానాలే భారత భద్రతా సంస్థలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. రక్షణ శాఖ, భద్రతా బలగాల అధికారులు ఉపయోగించే వాట్సాప్ గ్రూపుల్లోకి పాకిస్థాన్ నిఘా వర్గాలు చొరబడినట్లు గుర్తించడం కలకలం రేపుతోంది.

వాట్సాప్ గ్రూపుల్లోకి పాక్ గూఢచారులు.. భద్రతా సంస్థల హై అలర్ట్
Pakistani Spies Infiltrate 14 Defence Whatsapp Groups Trigger Security Alert In India
Sharada V
|

Updated on: Nov 24, 2026 | 9:02 PM

Share

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), రక్షణ శాఖకు చెందిన పౌర అధికారులు ఉపయోగిస్తున్న సుమారు 13 నుంచి 14 ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల్లో పాకిస్థాన్ నిఘా సంస్థలకు చెందిన వ్యక్తులు చొరబడినట్లు భద్రతా, నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ వ్యవహారాన్ని సాధారణ సైబర్ దాడిగా కాకుండా.. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో సాగుతున్న గూఢచర్యంగా అనుమానిస్తున్నారు.

భారతీయ నంబర్లతో గ్రూపుల్లోకి ఎంట్రీ..  సైలెంట్ నిఘా!

అనుమానిత పాక్ ఆపరేటివ్స్ నేరుగా తమ గుర్తింపును బయటపెట్టకుండా, భారతీయ మొబైల్ నంబర్లను ఉపయోగించి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నకిలీ నంబర్లు లేదా ఇతరుల చేతిలోకి వెళ్లిన భారతీయ నంబర్లను ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ వ్యక్తులు గ్రూపుల్లో చేరిన తర్వాత ఎలాంటి సందేశాలు పంపకుండా సైలెంట్ మెంబర్లుగా కొనసాగారు. గ్రూపుల్లో సభ్యులు చేసే సంభాషణలు, షేర్ చేసే డాక్యుమెంట్లు, ఇతర సమాచారాన్ని నిశ్శబ్దంగా గమనించారు. ఈ వ్యవహారాన్ని సాధారణ సైబర్ మోసంగా కాకుండా సున్నితమైన భద్రతా విధుల్లో ఉన్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ గూఢచర్యంగా పేర్కొంటున్నారు.

అన్ని గ్రూపులపై నిఘా..  సభ్యుల వివరాలు తనిఖీ

ఈ విషయం బయటపడటంతో కేంద్ర భద్రతా సంస్థలు అలర్టయ్యాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రక్షణ శాఖకు చెందిన పౌర విభాగాలు తమ సోషల్ మీడియా, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆదేశించాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ప్రతి సభ్యుడి వివరాలను పరిశీలించాలని, ఎవరో తెలియని వ్యక్తులు, గుర్తింపు నిర్ధారించని సభ్యులు ఉంటే వెంటనే గ్రూపుల నుంచి తొలగించాలని స్పష్టం చేశాయి. అధికారిక సమాచారం, రహస్య పత్రాలు, కీలక డేటాను వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని హెచ్చరించాయి.

‘సోనియా’ పేరుతో చొరబాటు

ఇటీవల రక్షణ శాఖకు చెందిన పౌర అధికారులు ఉపయోగించే ఓ వాట్సాప్ గ్రూపులో ‘సోనియా’ (Soniya) అనే పేరుతో ఓ అనుమానిత వ్యక్తి సభ్యురాలిగా చేరినట్లు అధికారులు గుర్తించారు. ఆమె పాకిస్థాన్ నిఘా వర్గాలకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ గ్రూపులోని కొంతమంది నుంచి డబ్బులు తీసుకుని సున్నితమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. తాజాగా మరిన్ని గ్రూపుల్లో ఇలాంటి చొరబాట్లు బయటపడటం భద్రతా సంస్థలను మరింత అప్రమత్తం చేసింది.

స్మార్ట్‌ఫోన్‌లోని ఓ చిన్న వాట్సాప్ గ్రూపు కూడా గూఢచర్యానికి వేదికగా మారే ప్రమాదం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా రక్షణ, భద్రతా విభాగాల్లో పనిచేసే అధికారులు సోషల్ మీడియా వినియోగంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

Follow Us