Marriage: పెళ్లి అనేది అందరికీ ఒక చక్కని స్వప్నం. ఆ స్వప్నాన్ని కరోన చిదిమేసే పరిస్థితి వస్తే.. ఎవరూ తట్టుకోలేరు. పైగా జీవితంలో పెళ్లి అనే మాట మీదే విరక్తి కలుగుతుంది. అన్నీ బావున్నాయి.. అంతా బావుంది.. అనుకున్న తరుణంలో.. ఇక పెల్లిపీటలు ఎక్కడమే తరువాయి అనుకుంటున్న సమయంలో వరుడిని కరోనా వైరస్ పట్టుకుంటే.. ఎవరైనా ఏం చేస్తారు? మన ఖర్మ ఇంతే.. నీకు కరోనా తగ్గిన తరువాత మనం మరో ముహూర్తంలో పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఎప్పుడు ఆ వరుడికి కరోనా తగ్గుతుందా? క్వారంటైన్ ముగుస్తుందా అని ఎదురు చూస్తారు. కదా. కానీ ఓ నవ వధువు అలా చేయలేదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మా పెళ్లి కూడా అంతే. కరోనాకు భయపడి ముహూర్తం వాయిదా ప్రసక్తే లేదు అని భీష్మించింది. కోవిడ్ ఆసుపత్రే కల్యాణ మండపంగా.. కోవిడ్ వార్డె వేదికగా.. కరోనా పేషెంట్లు తమ బంధువులుగా.. వైద్య సిబ్బంది తమ పెద్దలుగా భావించి అదే ముహూర్తంలో పెళ్లి చేసుకుని ఔరా అనిపించింది ఆ నవ వధువు. ఈ కోవిడ్ పెళ్లి కేరళలో జరిగింది..
కేరళలోని కైనంకరి ప్రాంతానికి చెందిన శరత్, అభిరామికి వివాహం కుదిరింది. ఈ నెల 25న ఇద్దరికీ పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. అయితే ఇంతలో కరోనా రూపంలో అనుకోని కష్టమొచ్చిపడింది. కాబోయే భర్తకి, అత్తకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇద్దరూ అలప్పుజా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరుడికి కరోనా సోకిందని తెలిసినా అభిరామి బెదిరిపోలేదు. మనసుకు దగ్గరైన వరుడిని అదే రోజు వివాహమాడాలని నిర్ణయించుకుంది. ఇరుకుటుంబాల సభ్యులను ఒప్పించింది. ఇరుకుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలసి విషయం విన్నవించడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కోవిడ్ వార్డు కాస్తా కాసేపు కల్యాణ మండపంగా మారింది. పీపీఈ కిట్‌లో వచ్చిన అభిరామి, శరత్ దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. దండలు అందించింది అదే వార్డులో ఉన్న ఆమె అత్తగారే కావడం విశేషం.
కరోనా పేరు చెబితే అయినవాళ్లే దూరంగా పరిగెడుతున్న కాలంలో… కరోనా వచ్చిందట అంటూ దగ్గరికి రానివ్వకపోగా.. దాదాపు వెలివేసినంత పనిచేస్తున్న సమయంలో నవ వధువు ఇలా ధైర్యంగా ముందడుగు వేయడం ఇప్పుడు అందరిలోనూ చర్చను రేకెత్తిస్తోంది. ఆమె గుండె ధైర్యానికి అందరూ జై కొడుతున్నారు. విపత్కర పరిస్థితులకు బెదిరిపోకుండా ఎదురొడ్డి నిలబడటమే మానవత్వం అని ఆమె సందేశం ఇచ్చినట్టు ఉంది. ఇకనైనా కరోనా పేషెంట్ ను చూసి ఆమడ దూరం పారిపోకుండా.. వారికీ వీలైనంత సహాయంగా నిలిచే పని చేయాల్సి ఉందని ఈ ఉదంతం చెబుతోంది. మీరేమంటారు..?