
మనం ప్రతిరోజూ స్నానం చేస్తాము..దుస్తులు మార్చుకుంటాం. బూట్లు మార్చుకుంటాం, కానీ, ఈ ప్రకృతిలో ఒక జీవి తన చర్మాన్ని నేరుగా మార్చుకుంటే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును, పాములు నిజంగానే ఇలా చేస్తాయి. అది వాటికి ఉన్న సాధారణ అలవాటు మాత్రమే కాదు.. సైన్స్‌కు అసాధారణ ఉదాహరణ. పాము తన పాత చర్మాన్ని తొలగించడమే కాకుండా, తన శరీరాన్ని తిరిగి పునర్నిర్మించుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. జంతు శాస్త్రంలో దీనిని ” ఎక్డిసిస్” అంటారు. కొన్ని జంతువులు కూడా తమ చర్మాన్ని తొలగించుకుంటాయి. కానీ పాములు తమ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే ఒకే చర్మ పొరను తొలగిస్తాయి. ఇలా ఎందుకు చేస్తాయంటే..
టేనస్సీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పిన వివరాల మేరకు…పాములు రెండు పొరల చర్మాన్ని కలిగి ఉంటాయి. లోపల మృదువైన చర్మం, పైన గట్టి బాహ్యచర్మం ఉంటుంది.. ఈ పై చర్మం ఒక రకమైన బలమైన షెల్ లాంటిది. కానీ ఈ చర్మం సాగేది కానందున, పాము పెరిగేకొద్దీ అది బిగుతుగా అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు పాము దాన్ని విడిచిపెడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎలాగంటే, ఎదిగే పిల్లలకు పాత బట్టలు మార్చినట్లే. ఇకపోతే, చిన్న పాములు సంవత్సరానికి 3-4 సార్లు తమ చర్మాన్ని తొలగిస్తాయి. వాటిలో శరీరం వేగంగా పెరుగుతుంది. దానిని రక్షించుకోవడానికి కొత్త చర్మం అవసరం.
లోపలి నుండి కొత్త చర్మం ఏర్పడుతుంది. పాత చర్మం నుండి వాటిని వేరు చేయడానికి రెండింటి మధ్య ఒక ద్రవం స్రవిస్తుందట.. అప్పుడు పాము తన తలను ఒక కఠినమైన వస్తువుకు రుద్దుతుంది. అలా దాని పాత చర్మంలో రంధ్రం చేస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా దాని నుండి బయటకు వస్తుంది. ఇక అప్పుడు అన్నీ పూర్తిగా కొత్త రంగులో, మెరిసే కొత్త రూపంలో ఉంటాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..