కారు చోరీకి పాల్పడినట్లు ఓ యువకుడిపై ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. చుట్టుపక్కలంతా గాలించారు. అకస్మాత్తుగా, పోలీసుల దృష్టి అతడి ఇంట్లోని ఓ గదిలో ఒక వైపు ఉంచిన పెద్దగా కనిపించిన ఒక టెడ్డీ బేర్‌పైకి వచ్చింది. అది ఊపిరి పీల్చుకుంటుంది.! దాంతో అనుమానం వచ్చిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. బ్రిటన్ (యునైటెడ్ కింగ్‌డమ్) పోలీసులు దొంగను పట్టుకున్న ఈ ఫన్నీ సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ‘టెడ్డీ బేర్ దొంగ’ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలు వివరాల్లోకి వెళితే,..
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఓ కారును దొంగిలించిన వ్యక్తి గురించి గ్రేటర్ మాంచెస్టర్ పోలీసుల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని ప్రకారం, 18 ఏళ్ల జాషువా డాబ్సన్ ఈ ఏడాది మే నెల నుండి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడు ఓ కారును దొంగిలించి, పెట్రోల్ బంక్‌లో డబ్బులు కట్టకుండా పెట్రోల్ నింపుకొని పారిపోయాడు. గత నెల, పోలీసు అధికారులు అతడి అడ్రస్ కనుక్కొని, అరెస్టు చేయడానికి వెళ్లారు..అయితే, అతని ఇంట్లో ఎవ్వరూ లేరని, ఆ తర్వాత ఏం జరిగిందో పోలీసులు వివరించారు..
“మేము అతనిని అరెస్టు చేయడానికి వెళ్లాము. డాబ్సన్‌ను కనుగొనే ముందు మా అధికారులు ఒక పెద్ద ఎలుగుబంటి ఊపిరి పీల్చుకోవడం గమనించారు!”. షాకైన పోలీసులు విషయం ఏంటని గమనించే సరికి 18 ఏళ్ల ఈ అతి తెలివి దొంగ ఆ 5 అడుగుల టెడ్డీ బేర్‌లో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం, మోసం నేరాలు మోపి శిక్ష విధించగా, అతడు ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన నెటిజనులు ‘ఐడియా బాగుంది కానీ వర్కౌట్ కాలేదంటూ’ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తనికి వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.