దక్షిణ కొరియాలో ఆదివారం చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదానికి గురైన విమానం రన్‌వే పై నుంచి అదుపుతప్పి గోడను ఢీకొని మంటల్లో కాలిబూడిదయ్యింది. ప్రమాద సమాయనికి సిబ్బంది సహా 181 మంది విమానంలో ఉన్నారు. అందులో ఇద్దరు మాత్రమే బతికి బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ ఇద్దరినీ ఫ్లైట్ అటెండెంట్‌లుగా గుర్తించారు. అందులో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు. వారిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
విమానం చివరి భాగంలో కూర్చోవడంతో పాటు సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే ఇద్దరూ ప్రమాదం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. కమర్షియల్ విమానాల్లో వెనుక భాగాన్ని సురక్షితంగా భావిస్తారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు వెనుక భాగంలోని సీట్లు అత్యంత సురక్షితమని పలు అధ్యయనాల్లో తేలింది. ముందు, మధ్య వరుసలో కూర్చునే వారి కంటే వెనుక భాగంలో సీట్లో ఉన్నవారు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడినట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
బ్యాంకాక్ నుంచి మువాన్‌కు 181 మందితో వస్తోన్న జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై నుంచి అదుపుతప్పి చివరన ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొట్టింది. అక్కడ కాంక్రీట్ గోడ కనుక లేకపోయుంటే చాలామంది ప్రాణాలతో బయటపడేవారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ విమానం ఢీకొట్టగానే కూలిపోయేలా గోడ ఉండాలని, కానీ కాంక్రీట్‌తో ఎందుకు నిర్మించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..