
సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కేవలం ఇండియాలోనే సాధ్యం అంటూ వాటికి క్యాప్షన్లు కూడా ఇస్తుంటారు నెటిజన్లు. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మరీ ఇంత బుద్ధి తక్కువగా ఎలా ఉంటారు అనిపించేలా ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఏదో చేశాం అంటే చేశాం అనేలా పనులు మమ అనిపించి.. లక్షలు, కోట్ల బిల్లు దొబ్బేస్తుంటారు.
తాజాగా అలాంటిదే ఓ నిర్వాహకం బయటపడింది. ఏకంగా వంద కోట్లతో రోడ్డు వేసి.. రోడ్డు మధ్యలో ఉన్న చెట్లను అలానే వదిలేసి.. వాటి మధ్యలో కూడా తారు వేసి వెళ్లిపోయారు. ఆ రోడ్డుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రవిచిత్రమైన రోడ్డు నిర్మాణ పనులు బీహార్‌లోని జెహానాబాద్‌లో జరిగాయి. రాజధాని పాట్నా నుండి 50 కి.మీ దూరంలో ఉంది. ఈ రోడ్డు రూ.100 కోట్లతో నిర్మించారు.
జెహానాబాద్‌లో పాట్నా-గయా ప్రధాన రహదారిపై 7.48 కిలో మీటర్ పొడవైన రహదారి మధ్యలో చెట్లు ఉన్నాయి. వాటిని అలాగే వదిలేసి.. రోడ్డు వేసేశారు. జిల్లా యంత్రాంగం రూ.100 కోట్ల రోడ్డు విస్తరణ ప్రాజెక్టును చేపట్టినప్పుడు, వారు చెట్లను తొలగించడానికి అనుమతి కోరుతూ అటవీ శాఖను సంప్రదించారు. కానీ అటవీ శాఖ అందుకు అనుమతి ఇవ్వలేదు. ఆ చెట్లను నరికితే ప్రతిగా అటవీ శాఖ 14 హెక్టార్ల అటవీ భూమికి పరిహారం డిమాండ్ చేసింది. అయితే జిల్లా యంత్రాంగం ఆ అభ్యర్థనను నెరవేర్చలేకపోయింది. పైడి చెట్లను అలాగే ఉంచేసి.. రోడ్డు వేసేశారు. రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద చెట్లు ఉండటం వల్ల ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. అయితే జిల్లా యంత్రాంగం చెట్లను తొలగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక పెద్ద ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి