Bengaluru: రూ.40 పైసలు ఎక్కువగా బిల్లు వేశారని కోర్టు మెట్లెక్కిన కస్టమర్‌.. న్యాయస్థానం ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?..

|

Mar 15, 2022 | 9:36 AM

సాధారణంగా ఏదైనా హోటల్‌ లేదా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు బిల్లుతో పాటు సర్వ్‌ చేసిన వెయిటర్లకు టిప్‌ కూడా చెల్లిస్తాం. అలాంటిది ఓ హోట‌ల్‌లో త‌న బిల్లు కంటే 40 పైస‌లు ఎక్కువ‌గా ఛార్జ్ చేశార‌ని ఓ వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు.

Bengaluru: రూ.40 పైసలు ఎక్కువగా బిల్లు వేశారని కోర్టు మెట్లెక్కిన కస్టమర్‌.. న్యాయస్థానం ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?..
Follow us on

సాధారణంగా ఏదైనా హోటల్‌ లేదా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు బిల్లుతో పాటు సర్వ్‌ చేసిన వెయిటర్లకు టిప్‌ కూడా చెల్లిస్తాం. అలాంటిది ఓ హోట‌ల్‌లో త‌న బిల్లు కంటే 40 పైస‌లు ఎక్కువ‌గా ఛార్జ్ చేశార‌ని ఓ వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన మూర్తి అనే సీనియర్‌ సిటిజన్‌ గతేడాది సెంట్రల్‌ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ తెప్పించుకున్నాడు. కడుపునిండేలా తిన్నాడు. దీనికిగాను హోటల్‌ అతనికి రూ.265 బిల్లు వేశారు. వాస్తవానకి ఆయన ఆర్డర్‌ చేసిన ఫుడ్‌కు అయిన బిల్లు ఖర్చు రూ.264.60. అయితే రౌండ్‌ ఫిగర్‌ చేసి రూ.265 ఛార్జ్‌ చేశారు. ఇదే విషయమై హోట‌ల్ సిబ్బందితో చర్చించాడు. కానీ.. హోట‌ల్ స్టాఫ్ అత‌డిని ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. దీంతో కోపం వ‌చ్చిన మూర్తి బెంగ‌ళూరులోని వినియోగదారుల ఫోరంలో హోటల్‌పై కేసు వేశాడు. త‌న వ‌ద్ద నుంచి అదనంగా రూ.40 పైస‌ల‌ను హోట‌ల్ చార్జ్ చేసింద‌ని.. ఆ హోటల్‌ చాలామంది కస్టమర్లను ఇలాగే మోసం చేస్తోందంటూ హోట‌ల్ లూటీ చేస్తోందంటూ ఫిర్యాదులో మూర్తి పేర్కొన్నాడు. దీనికి బ‌దులుగా త‌న‌కు రూపాయి న‌ష్టపరిహారాన్ని చెల్లించాలని ఫోర‌మ్‌ను కోరారు.

కస్టమర్ కే రూ.4000 జరిమానా..

కాగా రెస్టారెంట్ త‌రపున కోర్టులో వాదించిన లాయర్లు.. అస‌లు ఈ కేసు ప‌నికిరానిది.. రెస్టారెంట్ చార్జ్ చేసిన రౌండ్ ఫిగ‌ర్ అమౌంట్ ఫుడ్‌ కోసం కాదని.. అది ట్యాక్స్ కిందకు వ‌స్తుంద‌న్నారు. సెంట్రల్‌ గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ -2017 లోని సెక్షన్‌-170 ప్రకారమే రెస్టారెంట్ బిల్లు వేసింద‌ని న్యాయస్థానానికి విన్నవించారు. అలా సుమారు ఎనిమిది నెల‌ల పాటు ఈ కేసు విచార‌ణ కొన‌సాగింది. ఈకేసు విచారణ కోసం జడ్జీలు గతంలో ఇచ్చిన తీర్పులు, వివిధ సెక్షన్లను రెఫరెన్స్‌ చేయాల్సి వచ్చింది. చివరకు బిల్లులో 50 పైస‌ల కంటే త‌క్కువ ఉంటే.. అప్పుడు ఆ పైస‌ల‌ను తీసేసి రౌండ్ ఆఫ్ చేసి బిల్లు వేస్తార‌ని.. ఒక‌వేళ 50 పైస‌ల కంటే ఎక్కువ ఉంటే.. దాన్ని రూపాయిగా ప‌రిగ‌ణిస్తార‌ని కోర్టు స్పష్టం చేసింది. కస్టమర్‌ బిల్లు రూ.264.60 అయినందున‌.. 50 పైస‌ల కంటే ఎక్కువ ఉండ‌టం వ‌ల్ల దాన్ని రూపాయిగా మార్చి.. బిల్లును రూ.265 గా మార్చార‌ని.. ఇందులో హోటల్‌ త‌ప్పేమీ లేద‌ని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటువంటి ప‌నికిమాలిన కేసు వేసి కోర్టు విలువైన సమయాన్ని, హోటల్‌ రెప్యూటేషన్‌ను దెబ్బతీసినందుకు కేసు వేసిన మూర్తికే కోర్టు తిరిగి జరిమానా విధించింది. ఇటీవల తీర్పు వెలువరించిన న్యాయస్థానం రెస్టారెంట్‌కు రూ.2000ల నష్టపరిహారం చెల్లించాలని, కోర్టు ఖ‌ర్చుల కోసం మ‌రో రూ.2000 కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని మూర్తికి ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో 40 పైస‌ల కోసం కోర్టుకు ఎక్కిన మూర్తి 8 నెల‌ల పాటు కోర్టు చుట్టూ తిరిగాడు. సమయం వృథా చేసుకోవ‌డ‌మే కాకుండా చివ‌ర‌కు రూ.4000 తిరిగి చెల్లించాల్సి వ‌చ్చింది.

Also Read:Viral Video: హాలీవుడ్‌ సినిమాను తలపించిన పక్షుల విన్యాసం.. రొమాంటిక్ సీన్ చూస్తే మైమరిచిపోవాల్సిందే..

Covid-19 Update: దేశంలో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్‌ కేసులు

Sidharth Malhotra: షేర్షా హీరో చేసిన పనికి ఫిదా అవుతోన్న అమ్మాయిలు.. కారణమేంటంటే..