
ఓ ప్రయాణికుడు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. కానీ అతని కదలికలు కాస్త అనుమానాస్పదంగా కనిపించాయి అధికారులకు. ముఖ్యంగా అతని నోటి భాగం చాలా తేడాగా కనిపించింది. ఏంటబ్బా ఇలా ఉన్నాడూ అని అనుమానంతో అతన్ని ఆపి చెక్ చేశారు. అంతే ఊహించని విధంగా బంగారం అతని నోట్లో దొరికింది. దీంతో అక్రమ రవాణాకు ప్రయత్నించిన అతన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నోటిలో క్యాప్సూల్స్‌ను దాచి వాటిలో బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 82 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం.. సదరు భారతీయ ప్రయాణికుడు దుబాయ్ నుంచి తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకున్నాడు. అనంతరం ఘజియాబాద్‌కు వెళ్లే విమానం ఎక్కేందుకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1కు వెళ్లాడు. బుధవారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో అతనికి సాధారణ భద్రతా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సమయంలో ప్రయాణికుడి ప్రవర్తన సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించింది. భద్రతా తనిఖీ ప్రక్రియకు సరిగ్గా స్పందించకపోవడంతో అతడిని మరింత క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతడి వద్ద అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు అనుమానం కలిగించే వస్తువులు గుర్తించారు. ప్రయాణికుడి నోటిలో దాచిన రెండు క్యాప్సూల్స్‌ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిలో సుమారు 82 గ్రాముల బంగారం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బంగారాన్ని గుర్తించిన అనంతరం ప్రయాణికుడిని తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారికంగా పరిశీలించి దాని స్వచ్ఛత, ఖచ్చితమైన విలువను నిర్ధారించేందుకు పరీక్షలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు.