పదేళ్ల పిల్లాడిపై భగ్గుమన్న సోషల్‌ మీడియా..! అంత ద్వేషం ఎందుకంటూ సింగర్‌ చిన్మయి ఫైర్‌..

కౌన్ బనేగా కరోడ్‌పతిలో చిన్నారి ప్రవర్తన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అమితాబ్‌తో చిన్నారి అత్యుత్సాహం, అగౌరవ ప్రవర్తనపై నెటిజన్లు తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే, సింగర్ చిన్మయి శ్రీపాద చిన్నారిని ట్రోల్ చేయడాన్ని ఖండించి, పెద్దల ద్వేషాన్ని తప్పుబట్టారు.

పదేళ్ల పిల్లాడిపై భగ్గుమన్న సోషల్‌ మీడియా..! అంత ద్వేషం ఎందుకంటూ సింగర్‌ చిన్మయి ఫైర్‌..
Ishit Bhatt Kbc

Updated on: Oct 14, 2025 | 12:05 AM

అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షోలో ఇటీవలె ఓ పిల్లాడు పాల్గొన్నాడు. ఆ షోలో ఆ పిల్లాడు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పిల్లాడి ప్రవర్తన చూసి, అసలు పిల్లల్ని పెంచే పద్దతి ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ఆ పిల్లాడి తల్లిదండ్రులపై చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు.

గుజరాత్ లోని గాంధీ నగర్ కు చెందిన ఐదో తరగతి విద్యార్థి ఇషిత్ భట్, కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 17లో పాల్గొన్నాడు. ఎవరూ వచ్చినా హోస్ట్ గేమ్ మొదలుపెట్టడానికి ముందు, ఆ గేమ్ రూల్స్ చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా అమితాబ్ రూల్స్ చెప్పబోతుంటే ఆ పిల్లాడు తనకు గేమ్ రూల్స్ తెలుసు అని, ముందు ప్రశ్న అడగమని అడిగమని కాస్త అత్యుత్సాహం చూపుతాడు. అలాగే మాట్లాడేటప్పుడు అమితాబ్ కి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా.. ఏంటీ మరీ ఇలా చేస్తున్నాడు అనేలా ఉంటుంది అతడి ప్రవర్తన. ప్రశ్నలు అడగడం మొదలుపెట్టగానే, ఆప్షన్స్ అడగక ముందే ఆన్సర్లు చెప్పడం లాంటివి చేశాడు. మొదటి నాలుగు ప్రశ్నలకు ఆప్షన్స్ చెప్పకుండానే సమాధానాలు చెప్పాడు.

తర్వాత ఐదో ప్రశ్న రామాయణం గురించి అడిగే సరికి ఆన్సర్ చెప్పలేకపోయడు. ఆప్షన్స్‌ ఇచ్చిన తర్వాత తప్పు ఆన్సర్‌తో గేమ్ నుంచి ఔట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. పిల్లాడిని పేరెంట్స్ సరిగా పెంచలేదని చాలా మంది ట్రోల్ చేయడం గమనార్హం. పిల్లలకు ఎన్ని తెలివితేటలు ఉన్నా, పెద్దవారి ముందు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే వేస్ట్ అని చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే ఆ పిల్లాడిపై జరుగుతున్న ట్రోల్‌పై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. చిన్న పిల్లాడి ప్రవర్తన సరిగా లేదు అని సోషల్ మీడియాలో పెద్దవాళ్లు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. దగ్గు మందు తాగి పిల్లలు చనిపోయినప్పుడు మాత్రం ఒక్కరి గొంతు కూడా లేవలేదు. చిన్న పిల్లాడు కాస్త అత్యుత్సాహం చూపిస్తే, ఇంతలా ద్వేషిస్తూ కామెంట్స్ చేస్తారా? అంటూ మండిపడ్డారు చిన్మయి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి