హీరో చిరంజీవి, శ్రీకాంత్ కలిసి నటించిన శంకర్‌దాదా MBBS గుర్తుందా? ఇందులో శంకర్ దాదా క్యారెక్టర్‌లో చిరంజీవి ఒక్క కౌగిలింత బాధలో ఉన్నవారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, అన్ని టెన్షన్‌లను వదిలించుకుని మనశ్శాంతికి గొప్ప మార్గంగా అభివర్ణించారు. అవును, ఎవరైనా బాధపడినా, కలత చెందినా, జీవితంలో అలసిపోయినా… అతన్ని గట్టిగా కౌగిలించుకోండి. దాంతో ఆ మనిషి ప్రశాంతంగా ఉంటాడు! ఈ సమయంలో అతను భావోద్వేగానికి గురవుతాడు.. అప్పుడు తనలోని స్ట్రెస్ మొత్తాన్ని ఏడుపు ద్వారా వెల్లగక్కుతాడు..మీకు ఇదంతా చిత్రమైన అనుభూతిగా అనిపించినప్పటికీ..అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇలాంటి మ్యాజిక్ హగ్ సంఘటన భారీ బ్యాంక్ చోరీకి అడ్డుకట్టవేసింది.
అసలు విషయం ఏమిటి?
నివేదిక ప్రకారం, మే 22 సోమవారం నాడు 69 ఏళ్ల మైఖేల్ ఆర్మస్ అనే వృద్ధుడు చెక్ డిపాజిట్ చేయడానికి ‘బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్’ శాఖకు వచ్చారు. క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న బ్యాంకు ఉద్యోగిని తన బ్యాగ్‌లో పేలుడు పదార్థాలు ఉన్నాయని మాస్క్‌లు ధరించిన వ్యక్తి బెదిరించడం చూశాడు. డబ్బులు ఇవ్వకుంటే పేల్చేస్తానంటూ అతడు బెదిరించసాగాడు. ఇది విని బ్యాంకు ఉద్యోగితో సహా బ్యాంకు కస్టమర్లు సైతం భయాందోళనకు గురయ్యారు. కానీ, 69ఏళ్ల మైఖేల్ ఆర్మస్ మాత్రం.. అతని ప్రాణాలను పట్టించుకోకుండా నిరాయుధుడిగానే దుండగుడితో మాట్లాడటానికి వెళ్ళాడు. బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన వ్యక్తిని ‘హగ్’ చేసి భావోద్వేగానికి గురిచేశాడు. అదేంటని ఆశ్చర్యపోతున్నారు కదా..
అవును, మైఖేల్ ముసుగు ధరించిన వ్యక్తి వద్దకు వెళ్లి, తెలివిగా అతనితో ఏదో మాట్లాడటం ప్రారంభించాడు. మైఖేల్ అతనితో మాట్లాడుతూ…ఇలా అడిగారు – విషయం ఏమిటి? నీకు ఉద్యోగం లేదా? దానికి ఆ వ్యక్తి- ఈ నగరంలో నాకు ఏమీ లేదు. నేను జైలుకు వెళ్లాలనుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. మాటల్లో ఉండగానే మైఖేల్ ఆ వ్యక్తిని క్యాష్ కౌంటర్ నుండి డోర్‌కి కొంచెం దూరంగా తీసుకెళ్లాడు. ఈలోగా అతన్ని అప్యాయంగా కౌగిలించుకున్నాడు. దాంతో బ్యాంకును దోచుకునేందుకు వచ్చిన దుండగుడు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్యాంకు ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందించారు. వుడ్‌ల్యాండ్ పోలీసులు, ఉన్నతాధికారులు బ్యాంకుకు చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇక్కడ వృద్ధుడి ధైర్యాన్ని ప్రజలు అభినందిస్తున్నారు.
విచారణలో, వ్యక్తి పేరు ఎడ్వర్డో ప్లాసెన్సియా అని, అతని వయస్సు 42 సంవత్సరాలు అని పోలీసులు గుర్తించారు. తన వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని చెప్పాడు. కేవలం బెదిరించి డబ్బు దోచుకోవాలనుకున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిపై చోరీకి యత్నించడం, బెదిరించడం, భయానక వాతావరణం సృష్టించడం వంటి నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో, మైఖేల్ ధైర్యాన్ని, అవగాహనను ప్రశంసిస్తూ వుడ్‌ల్యాండ్ పోలీసులు ఫేస్‌బుక్‌లో విషయాన్ని పోస్ట్ చేశారు. దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది తెలిసిన చాలా మంది నెటిజన్లు వృద్ధుడి ధైర్యానికి సెల్యూట్ చేశారు!
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..