థాయిలాండ్, సెప్టెంబర్ 27: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళా ఉద్యోగి అనుకోని పరిస్థితుల్లో సెలవు పెట్టవల్సి వచ్చింది. అప్పటికే వారం రోజులు సెలవు తీసుకున్న సదరు ఉద్యోగిని మరో రోజు సెలవు కావాలంటూ సిక్ లీవ్ రిక్వెస్ట్ పెట్టింది. కానీ సదరు కంపెనీ మేనేజర్ ఆమె అభ్యర్ధనను తిరస్కరించాడు. ఇది జరిగిన ఓ రోజు తర్వాత ఆ మహిళా ఉద్యోగి అనూహ్యరీతిలో మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది.
థాయ్‌లాండ్‌లోని సముత్ ప్రకాన్ ప్రావిన్స్‌లోని ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో మిసెస్ మే (30) అనే మహిళ ఉద్యోగం చేస్తుంది. అయితే ఆమెకు పెద్ద పేగుకు సంబంధించిన అనారోగ్యం తలెత్తడంతో సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 9 వరకు సిక్ లీవ్ తీసుకుంది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో మరో నాలుగు రోజులు అదనంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకోవల్సి వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత.. కోలుకోవడానికి మిసెస్ మే మరో రెండు రోజులు సెలవు తీసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబరు 12న తన ఆరోగ్య పరిస్థితి మరింత క్రిటికల్‌గా ఉందని మరో రోజు సిక్ లీవ్ ఇవ్వవల్సిందిగా తన మేనేజర్‌ని కోరింది. అయితే, కంపెనీ మేనేజర్ ఆమె సిక్‌లీవ్ అభ్యర్ధనను తిరస్కరించాడు. అప్పటికే చాలా రోజులు అనారోగ్యం పేరిట సెలవు తీసుకున్నందున, వెంటనే కంపెనీకి తిరిగి, అలాగే మెడికల్ సర్టిఫికెట్ కూడా సమర్పించాలని సదరు మేనేజర్ హుకూం జారీ చేశాడు.
ఉద్యోగం పోతుందనే భయంతో మిసెస్ మే అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సెప్టెంబర్ 13న ఉద్యోగం చేసేందుకు కంపెనీకి వెళ్లింది. అయితే, ఆమె తన సీటులో కూర్చుని 20 నిమిషాలు పనిచేసింది. అంతే ఒక్కసారిగా కూర్చున్న చోటే కుప్పకూలిపోయింది. సహోద్యోగులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు సర్జరీ కూడా చేశారు. కానీ ఆ మరుసటి రోజు సాయంత్రం ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే కన్నుమూసింది. నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్‌తో ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మిసెస్ మే ఉద్యోగం చేస్తున్న డెల్టా ఎలక్ట్రానిక్స్ మేనేజర్ ఆమె మరణానికి సంతాపం తెలుపుతూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ‘మా సహోద్యోగిని కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఆమె మరణానికి దారి తీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఆమె కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తన పోస్టులో తెలిపాడు. తాజా పరిణామంతో పని చేసేచోట అధిక పనిభారం, ఒత్తిడిపై సర్వత్రా చర్చ సాగుతోంది.