
అది చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ ప్రాంతం. స్థానికంగా నివశించే ఓ బాలుడి పొత్తి కడుపు ఉబ్బుగా ఉండటం చూసి అతని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పిల్లోడికి నొప్పి, అసౌకర్యం లేనప్పటికీ.. ఎందుకైనా మంచిదని సుజౌ విశ్వవిద్యాలయ అనుబంధ పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఎక్స్-రే తీయగా బాలుడి కడుపులో ఒక ఘన లోహ వస్తువు చిక్కుకున్నట్లు గుర్తించారు. మరింత విశ్లేషణ కోసం స్కాన్ తీయగా.. లోపల ఆశ్చర్యకర రీతిలో దాదాపు 100 గ్రాముల బరువున్న బంగారు కడ్డీ ఉందని నిర్ధారించారు. కేసును పరిశీలించిన సీనియర్ డాక్టర్లు.. ఆపరేషన్ అవసరం లేకుండా.. ఆ కడ్డీ మలం ద్వారా బయటకు వచ్చేందుకు మెడిసిన్ ఇచ్చి పంపారు. రెండు రోజుల తర్వాత మళ్లీ ఆస్పత్రికి రాగా స్కాన్‌లో ఆ కడ్డీ కొంచెం కూడా కదలకపోవడాన్ని గమనించారు. దీంతో మరి ఎక్కువకాలం ఆ కడ్డీ అలానే ఉంటే.. లోపల ఇంటర్నల్ డ్యామేజ్ జరుగుతుందని భావించి.. సర్జరీ చేయాలని నిర్ణయించారు.
ఇద్దరు సర్జన్లు బాలుడికి ఎండోస్కోపిక్ సర్జరీ చేశారు. ఈ ప్రక్రియ కేవలం 30 నిమిషాలు మాత్రమే కొనసాగింది. ఎటువంటి ప్రమాదం లేకుండా బాలుడి కడుపు నుంచి బంగారు కడ్డీని విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్ తర్వాత బాలుడు వెంటనే కోలుకున్నాడు. రెండు రోజుల్లోనే ఎప్పటిలాగా ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. లోపల ఎలాంటి ఇబ్బంది లేదని కన్ఫామ్ చేసుకున్నాక.. డాక్టర్లు ఆ చిన్నోడిని డిశ్చార్జ్ చేశారు.
Gold Bar
గతంలో కూడా ఇలాంటి కేసులు…
ఇలాంటి సంఘటనలు చైనా వైద్యులకు కొత్త కాదు. 2023లో ఇలాంటిదే ఒక కేసు వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలుడు 18 అయస్కాంత పూసలతో తయారు చేసిన బ్రాస్లెట్‌ను మింగేశాడు. మొదట్లో అపెండిసైటిస్ ఉన్నట్లు అనుమానించినప్పటికీ, అల్ట్రాసౌండ్ స్కాన్‌లో అతని పొత్తికడుపులో పూసలు చిక్కుకున్నట్లు వెల్లడైంది. తర్వాత సర్జరీ ద్వారా దాన్ని బయటకు తీశారు.
తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. పిల్లలను ఇంట్లో నిశితంగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రమాదకర వస్తువులను వారికి అందుబాటులో లేకుండా ఉంచాలంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..