మరణశయ్యపై ఉంటూ.. ఏడుగురికి జీవితాన్ని ప్రసాదించిన యువకుడు..!

జననం.. మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం.. మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదిస్తే చనిపోయినా బ్రతికి ఉన్నట్లే..! భౌతికంగా అతడు లేకపోయినా అతని అవయవాలు మాత్రం ఉనికిలో ఉంటూ ఏడుగురిలో రాజుగా నిలిచాడు. అతడి మరణం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసినా.. మరో నాలుగు కుటుంబాల్లో ఆశా దీపాన్ని వెలిగించాడు.

మరణశయ్యపై ఉంటూ.. ఏడుగురికి జీవితాన్ని ప్రసాదించిన యువకుడు..!
Organs Donates

Edited By: Balaraju Goud

Updated on: Jun 11, 2025 | 8:12 PM

జననం.. మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం.. మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదిస్తే చనిపోయినా బ్రతికి ఉన్నట్లే..! భౌతికంగా అతడు లేకపోయినా అతని అవయవాలు మాత్రం ఉనికిలో ఉంటూ ఏడుగురిలో రాజుగా నిలిచాడు. అతడి మరణం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసినా.. మరో నాలుగు కుటుంబాల్లో ఆశా దీపాన్ని వెలిగించాడు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేటకు చెందిన రాళ్లపల్లి ఆది నారాయణ చిరు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయన కొడుకు రాజు పట్టణంలో వేబ్రిడ్జి ఆపరేటర్‌గా పని పనిచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అయితే ఇటీవల మిర్యాలగూడ పట్టణంలో బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మిర్యాలగూడ నుండి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స పొందిన రాజు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

రాజుకు సంబంధించిన విషయం తెలుసుకున్న జీవధాన్ ట్రస్ట్ ప్రతినిధులు రాజు కుటుంబ సభ్యులను సంప్రదించారు. అవయవ దానంపై వారికి అవగాహన కల్పించారు. మృతిచెందిన తనయుడిని అవయవ దానంతో ఇతరుల్లో చూసుకోవచ్చని జీవధాన్ ప్రతినిధులు నచ్చజెప్పారు. దీంతో అవయవ దానానికి రాజు కుటుంబ సభ్యులు అంగీకరించారు. రాజు శరీరంలోని కాలేయం, రెండు మూత్ర పిండాలు, గుండె, ఊపిరితిత్తులు, రెండు కార్నియాలను జీవధాన్ ప్రతినిధులు సేకరించారు. ఈ అవయవాలను అవసరమైన ఏడుగురు రోగులకు అమర్చినట్లు జీవదాన్ ప్రతినిధులు తెలిపారు. అవయవదాతగా నిలిచి.. తమ కుమారుడు అమరుడయ్యాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. తాను మరణించి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపి అందరికి ఆదర్శంగా నిలిచారని స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..