
దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చే వేలాది మంది వలస కార్మికులకు పిల్లల చదువు ఎప్పటి నుంచో పెద్ద సమస్య. తరచూ ప్రాంతాలు మారాల్సి రావడం, సమీపంలో పాఠశాలలు లేకపోవడం వల్ల చిన్నారులు విద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్మికులు పనిచేస్తున్న నిర్మాణ ప్రాంగణాల వద్దే ‘వర్క్ సైట్ స్కూళ్లు’ ఏర్పాటు చేసి విద్యతో పాటు భద్రతను కూడా అందిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే తొలి వర్క్ సైట్ స్కూల్‌ను మే 3న నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంపులో ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ జి. శ్రీజన ఈ పాఠశాలను ప్రారంభించారు. విద్యాశాఖ, పురపాలక శాఖ, రాజపుష్ప ప్రాపర్టీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలలో 37 మంది చిన్నారులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చదువుకుంటున్నారు. మొత్తం 53 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వీరిలో ఎక్కువ మంది బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల పిల్లలే. ఇక్కడ ఇంగ్లీష్, గణితం, హిందీతో పాటు ఆటలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, విరామ సమయాలు కూడా పాఠశాల నిర్వహణలో భాగమే.
నిర్మాణ సైట్ల వద్దే తరగతులు నిర్వహించడం వల్ల పిల్లలు లేబర్ క్యాంపుల్లో నిర్లక్ష్యంగా తిరిగే పరిస్థితి ఉండదు. తల్లిదండ్రులు పనిలో ఉండగా చిన్నారులు సురక్షితంగా చదువుకునే అవకాశం లభిస్తోంది. ఇటీవల లేబర్ కాలనీల్లో చిన్నారులపై జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ పాఠశాలలు భద్రతా పరంగానూ కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించే దిశగా నార్సింగిలోని నవనామి, బీఎస్ఆర్ డెవలపర్స్ నిర్మాణ ప్రాంగణాల్లో మరో రెండు వర్క్ సైట్ స్కూళ్లు సిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్తులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సుమారు 100 లేబర్ క్యాంపుల్లో ఇలాంటి పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు కొత్త మరుగుదొడ్లు, ప్రత్యేక ఆట స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫాంలు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నగర నిర్మాణంలో కీలక పాత్ర పోషించే వలస కార్మికుల పిల్లలు కూడా నాణ్యమైన విద్యకు దూరం కాకూడదనే ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. చదువు, భద్రత, సంరక్షణను ఒకే చోట అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచే కొత్త నమూనాను అమలు చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి